పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/139

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మనహృదయంలో పాపాన్ని మిగులనీయదు. ఈ సంస్కారంలో క్రీస్తు మరణోత్దానాలు మనమీద సోకుతాయి. క్రీస్తు మరణం నరుల పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేస్తుంది. కనుక మన పాపం పూర్తిగా పరిహారమౌతుంది.

కాని జ్ఞానస్నానానంతరం గూడ మనలో పాపపు కోరికలుంటాయి. మన బలహీనతలూ వుండిపోతాయి. ఈ బలహీన దశలోవుండే మనం పిశాచంతో పోరాడాలి. ఆ పోరాటంలో నెగ్గితేనే మనకు మోక్షబహుమానం. జ్ఞానస్నానం ద్వారా దేవుడు ఈ బలహీనదశను తొలగింపడు.

పైన జ్ఞానస్నాన ఫలితాలను ఆరింటిని పేర్కొన్నాం. పెద్దవాళ్లు తమ భక్తినిబట్టి ఈ ఫలితాలను సంపూర్ణంగానైనా అసంపూర్ణంగానైనా పొందుతారు. చిన్నబిడ్డలు ఈ ఫలితాలను సంపూర్ణంగానే పొందుతారు.

ప్రార్థనా భావాలు

1. జ్ఞానస్నానం మనలను దేవునికి దత్తపుత్రులను చేస్తుంది. ఈ సంస్కారంద్వారా మనం దైవకుటుంబంలో సభ్యులమౌతాం. మన తండ్రియైన దేవుని జీవితాన్ని జీవిస్తాం. ఇది చాల దొడ్డ భాగ్యం.

భగవంతుడు నరుడ్డి తనకు పోలికగా చేసాడు - ఆది 1, 27. ఈ పోలికవల్లనే మనం దేవునికి బిడ్డలమయ్యేది. మనం పాపం చేసినప్పడు ఈ పోలిక మాసిపోతుంది. జ్ఞానస్నానం ద్వారా ఈ పోలిక మళ్లా నెలకొంటుంది.

మనం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది ఆయన ద్వారా ఆయన తండ్రికి బిడ్డలమౌతాం. అతడు మనకు జ్యేష్ఠ సోదరుడౌతాడు. మనమందరమూ అతనికి కనిష్ట సోదరులమౌతాం - రోమా 8,29. అతడు మనకు దేవుని కుమారులమయ్యే శక్తిని దయచేస్తాడు - యోహా 1,12. నరమాత్రులమైన మనం దేవుని కుమారుల మనిపించుకోవడం, యథార్థంగా కుమారులం కావడం, ఎంత అరుదైన భాగ్యం! - 1 యోహా 3.1. మన సొంత తల్లిదండ్రుల జీవితం మనలో ఏలా నెలకొని వుంటుందో దేవుని జీవితం గూడ మనలో ఆలాగే నెలకొని వుంటుంది.

2. జ్ఞానస్నానం ద్వారా మనం శ్రీ సభలో క్రొత్తగా పడతాం. ఈ సందర్భంలో సిప్రియన్ భక్తుడు ఈలావ్రాసాడు “క్రీస్తు ఏకైక పత్నియైన శ్రీసభ మనకు పుట్టువు నిస్తుంది. ఈ శ్రీసభ కన్యమాత దేవుని బిడ్డలకు జన్మనిచ్చేది ఈ తల్లే ఈ శ్రీసభ బిడ్డడు కానివాని పుట్టువు ఏమి పుట్టువు"?.