పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ట్రెంటుమహాసభ బోధల ప్రకారం జ్ఞానస్నానంలో క్రీస్తుని ధరించడం ద్వారా, అతని వరప్రసాదాన్ని పొందడం ద్వారా, మనం నూత్న సృష్టిమౌతాం. ఈ వరప్రసాదం ద్వారా అపవిత్రుడైన నరుడు పవిత్రుడౌతాడు. పాపియైనవాడు పుణ్యపురుషు డౌతాడు. దేవునికి శత్రువైనవాడు ఆయనకు స్నేహితుడౌతాడు. కడన నిత్యజీవనానికి అర్హుడౌతాడు జ్ఞానస్నానంలో నరుడు మడుగులోనుండి బయటికి రావడమూ, తెల్లకండువాను స్వీకరించడమూ, వెలిగేవత్తిని చేతపట్టుకోవడమూ మొదలైన క్రియలన్నీ నూత్నత్వానికి చిహ్నాలే.

6. పాపపరిహారాన్నీ శిక్షానిర్మూలనాన్నీ సంపాదించి పెండుతుంది.

పవిత్రాత్మ దిగివచ్చాక పేత్రు యెరూషలేములోని యూదులకు బోధిస్తూ "మీరు యేసుక్రీస్తు నామాన జ్ఞానస్నానం పొంది పాపక్షమనూ పవిత్రాత్మనూ పొందండి" అని చెప్పాడు - అచ 2, 38. అననీయ సౌలుతో "నీవు క్రీస్తు నామాన జ్ఞానస్నానం పొంది నీపాపాలను కడిగివేసుకో" అని చెప్పాడు - 22, 16. కనుక ఈ సంస్కారం మన పాపాలను తొలగిస్తుంది. పౌలుమాటల్లో అది "స్నానం" - తీతు 3,5. అనగా స్నానం మురికిని తొలగించినట్లే అది పాపాలను తొలగిస్తుంది.

జ్ఞానస్నానపు తంతులో పిశాచాన్ని పారదోలే ప్రార్ధనలుంటాయి. ప్రాతబట్టలను విప్పి వేయడమూ, మడుగులో మునగడమూ వుంటాయి. ఈ క్రియలన్నీ పాపపరిహారానికి చిహ్నాలే.

బర్నాబా లేఖ అనే ప్రాచీన గ్రంథం ఈలా చెప్తుంది, "మేము మా పాపాలతో నీళ్ళల్లోకి దిగాం. కాని ఆ మడుగులో నుండి బయటికి వచ్చినపుడు మా హృదయాల్లో క్రీస్త్తుపట్లా ఆత్మపట్లా భక్తివిశ్వాసాలు నెలకొన్నాయి." హెర్మసుగ్రంథం "వాళ్ళు చచ్చిన వాళ్ళగా నీళ్ళల్లోకి దిగారు, కాని బ్రతికిన వాళ్ళుగా బయటికి వచ్చారు" అని చెప్తుంది. విశ్వాస సంగ్రహంలో "పాపవిమోచనాన్ని దయచేసే ఒకే జ్ఞానస్నానాన్ని అంగీకరిస్తున్నాను" అని చెప్తాం. 1439లో ఫ్లోరెన్సు మహాసభ ఈలా బోధించింది. "ఈ సంస్కారంద్వారా జన్మపాపమూ కర్మపాపమూ అనిత్యశిక్షా కూడ తొలగిపోతాయి. కనుక జ్ఞానస్నానం పొందినవాళ్ళు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించనక్కరలేదు. ఈ సంస్కారాన్ని పొందినవాళ్ళ మళ్ళా సొంతపాపాలను చేయకుండానే చనిపోతే నేరుగా మోక్షానికి వెళ్ళి దేవుణ్ణి దర్శిస్తారు". (అనిత్య శిక్ష అంటే పాపాలకి మన్నింపు పొందినా, మోక్షానికి వెళ్ళకముందు శుద్ధి కొరకు ఉత్తరించే స్థలంలో కొన్ని బాధలు అనుభవించడం) జ్ఞానస్నానంలో క్రీస్తు వరప్రసాదాన్ని పొందుతామని చెప్పాం. ఈ వరప్రసాదం