పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతడు కూడ శృంగారవనంలో దిగంబరుడుగావుండి సిగ్గు చెందకుండా వుండేవాడు". ఈ భక్తుని ఉద్దేశం ఇది. జ్ఞానస్నానం ద్వారా మనం భాగ్యస్థితిని చేరుకొంటాం. తొలిమానవుని శృంగారవనపు జీవనస్థాయిని అందుకొంటాం, తొలినరుడు దేవునికి పోలికగా ఉండేవాడు. ఈ సంస్కారం ద్వారా మనం కూడ ఈ పోలికను పూర్ణంగా పొందుతాం.

క్రీస్తు జ్ఞానస్నానం పొందిన పిదప పిశాచంచే శోధింపబడ్డానికి ఎడారికివెళ్ళి అక్కడ "వన్యమృగాలతో వసించాడు" అని చెప్పంది మార్కుసువిశేషం - 1, 13. ఈవర్ణనం ఈ వొక్క సువిశేషంలో మాత్రమే కన్పిస్తుంది. క్రీస్తు వన్యమృగాలతో వసించడమనేది పూర్వం ఆదాము ఏదెను వనంలో మృగాలన్నిటికి పేర్లు పెట్టి వాటికి యజమానుడుగా వున్న భాగ్యస్థితిని తలపిస్తుంది - ఆది 2,20. అనగా క్రీస్తు శృంగార వనంలోని ఆదాములాంటివాడయ్యాడు. తాను రెండవ ఆదాము అయ్యాడు. అతనిలోనికి జ్ఞానస్నానం పొందిన మనం కూడ ఏదెను వనాన్నిచేరుకొంటాం. అచటి భాగ్యజీవనాన్ని అనుభవిస్తాం.

5. జలప్రళయం జలం

నోవా కాలంలో భూమిమీద జనం బొత్తిగా చెడిపోయారు. దేవుడు నలువదినాళ్లు జలప్రళయం కలిగించాడు. అది భూమిమీది పాపాత్ముల నందరినీ తుడిచిపెట్టింది. నోవా అతని కుటుంబ సభ్యులు ఎన్మిదిమంది మాత్రం ఓడలో ఎక్కి బ్రతికిపోయారు. ఇక్కడ ఒకే జలం మృత్యువుకీ జీవనానికీ గూడ కారణమైంది - ఆది 7,21-24.

ఈ జలప్రళయ జలం జ్ఞానస్నానజలాన్ని సూచిస్తుంది. అది మన దేహమాలిన్యాన్ని మాత్రమేకాక అంతరాత్మ మాలిన్యాన్ని కూడ తొలగించి మనలను శుద్ధిచేస్తుంది - పేత్రు 2, 19-21. క్రీస్తుని నమ్మి ఆయనలోనికి జ్ఞానస్నానం పొందినవాళ్ళకు ఈ నీరు జీవనసాధన మౌతుంది. కాని ఆయన్ని విశ్వసించనివాళ్ళకు అదే నీరు తీర్పు విధిస్తుంది. వాళ్ళ దుష్టులనీ శిక్షారులనీ నిరూపిస్తుంది - మత్త 24, 37-42, 2 పేత్రు 2,4-10.

ఇంకా, జ్ఞానస్నాన జలం మనలోనిపాపపు మానవునికి మృత్యువునీ, మనలోని ఆధ్యాత్మిక మానవునికి జీవాన్నీ తెచ్చి పెడుతుంది. ఈ విధంగా అది మనకు మృత్యువూ జీవం కూడ ఔతుంది. జలప్రళయ జలాలు జ్ఞానస్నానానికి సంకేతంగా వుంటాయి. దేవుని తీర్పువలన జలప్రళయంలో పాపపు నరజాతి అంతా చనిపోయింది. పుణ్యపురుషుడైన నోవా మాత్రం బ్రతికాడు. అలాగే జ్ఞానస్నానంలో మనలోని పాప మానవుడు చనిపోతాడు. మనలోని నూత్నమానవుడు, పుణ్య మానవుడు బ్రతుకుతాడు.

ఈ సందర్భంలో సిరిల్ భక్తుడు ఈలా వ్రాసాడు. "క్రీస్తు దేహాన్ని సమాధిలో వంచినట్లే నిన్ను జ్ఞానస్నానపు తొట్టిలోనికి తీసుకవెళ్ళారు. అక్కడ ముగ్గురు దైవవ్యక్తుల