పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ఈ జ్ఞానస్నానం మనలను క్రీస్తు మరణంలోనికి పాతిపెడుతుంది. ఆయన ఉత్థానంలోనికి లేపుతుంది. రోమా 6,3-4

ఇది చాల ముఖ్యమైన భావం. కనుక దీన్ని గూర్చి కొంచెం విస్తరంగా చెప్పాలి. మరణానంతరం క్రీస్తు శరీరాన్ని సమాధిలో పాతిపెట్టారు. ఇదే ప్రభువు భూస్థాపనం. మనం కూడ జ్ఞానస్నానంలో ప్రభువుతోపాటు భూస్థాపనం పొందుతాం, శ్రీసభ తొలిరోజుల్లో జ్ఞానస్నానం పొందేవాళ్ళను మూడుసార్లు తొట్టిలో మంచి వెలుపలికి కొనివచ్చేవాళ్లు, మనం వాడే బప్తిస్మం అనే మాటకు ముంచడం అనే అర్థముందని చెప్పాంగదా! క్రీస్తు మృతదేహం భూమిలోనికి వెళ్ళినట్లే నీటిలోనికి ముంచబడిన క్రైస్తవులును ఒకవిధంగా భూమిలోనికి వెళ్తారు. క్రీస్తుతోపాటు భూస్థాపనం కావడమంటే యిదే. క్రీస్తు భౌతికంగా చనిపోయాడు. కాని విశ్వాసులు జ్ఞానస్నానం ద్వారా భౌతికంగా చనిపోరు. ఆధ్యాత్మికంగా చనిపోతారు. అనగా పాపజీవితానికి చనిపోతారు.

మృతక్రీస్తు పితశక్తివలన సమాధినుండి సజీవుడై లేచాడు. లేచి మహిమతోగూడిన మోక్షజీవితం జీవిస్తున్నాడు. క్రీస్తు మరణంలోను భూస్థాపనంలోను పాలుపొందిన మనం ఆ ప్రభువు ఉత్తానంలో కూడ పాలుపొందుతాం. ఏలాగ? జ్ఞానస్నానం పుచ్చుకొనేవాళ్ళు తొట్టిలోమూడుసార్లు ముంచబడినంక వెలుపలికి వచ్చేవాళ్ళు ఈలా రావడం క్రీస్తు సమాధిలోనుండి లేక భూమిలో నుండి వెలుపలికి రావడాన్ని సూచిస్తుంది. క్రీస్తు మహిమ జీవితానికి ఉత్తానమయ్యాడు. జ్ఞానస్నానం పొందిన క్రైస్తవులు క్రొత్త జీవితానికి ఉత్తానమౌతారు. అనగా పూర్వ పాపజీవితం విడనాడి క్రొత్తజీవితం, క్రీస్తుజీవితం ప్రారంభిస్తారు.

కాని ఇక్కడ ఒక్కసంగతి గమనించాలి. ఇప్పటి మన జ్ఞానస్నానంలో తొట్టిలోకి వెళ్ళడమూ వెలుపలికి రావడమూ అనేవి లేవు. నేడు కేవలం నొసటిమీద నీళ్ళ పోస్తాం. కనుక భూమిలోకి ప్రవేశించడమూ మళ్ళీ బయటికి రావడమూ అనే సంకేతాలు ప్రాచీన జ్ఞానస్నాన విధికిమల్లె నేటి జ్ఞానస్నానవిధికి వర్తించవు. ఐనా పాపానికి చనిపోవడమూ, క్రొత్త జీవితానికి లేవడమూ అనే సంకేతాలు మాత్రం ఇప్పటి జ్ఞానస్నానవిధికీ వర్తిస్తాయి.

4. జ్ఞానస్నానం ద్వారా మనం క్రీస్తుని ధరిస్తాం - గల 8,27.పూర్వం ఈ సంస్కారాన్ని పొందేవాళ్ళను జ్ఞానస్నానపు తొట్టిలో మంచేవాళ్ళని చెప్పాం. అలా మునగక ముందు వాళ్ళు పాతబట్టలను తీసేవేసేవాళ్ళు. నీళ్ళల్లో నుండి వెలుపలికి వచ్చాక కొత్తబట్టలను ధరించెవళ్ళు. జ్ఞానస్నానం పొందిన భక్తులు క్రొత్తబట్లనులాగే క్రీస్తుని గూడ ధరిస్తారని పౌలు భావం.

5. పూర్వం యిస్రాయేలీయులు మోషే నాయకత్వాన రెల్లసముద్రందాటారు. ఈ సంఘటనాన్నే పౌలు "సముద్రంలోనికి జ్ఞానస్నానం పొందడం” అని పేర్కొన్నాడు.