పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూత్న వేదంలో మనం క్రీస్తు నాయకత్వాన మరో సముద్రం దాటతాం. ఈ సముద్రమే జ్ఞానస్నాన జలం. ఈలా దాటడం ద్వారా నాడు యిప్రాయేలీయులూ నేడు మనం కూడ మృత్యువు నుండి జీవంలోనికి అడుగిడతాం - 1 కొరి 10,1-2

6. పూర్వం సున్నతిద్వారా యిప్రాయేలీయులు దేవుని ప్రజలయ్యారు. ఇప్పడు ఈ జ్ఞానస్నానం క్రొత్తసున్నతి లాంటిది. దీనిద్వారా మనం క్రీస్తుప్రజలమౌతాం - కోలో 2,11.

7. జ్ఞానస్నానం వలన మన హృదయం మీద క్రీస్తు అనేముద్రపడుతుంది - ఎఫె 1,13. పూర్వం రోమనురాజ్యంలో ముద్రద్వారా పశువులూ బానిసలూ ఒక ప్రత్యేక యజమానునకు చెందివుండేవాళ్లు, అలాగే సైనికుల ఒక ప్రత్యేక నాయకునికీ, భక్తులు ఓ ప్రత్యేక దేవతకీ చెందివుండేవాళ్లు, జ్ఞానస్నానానికి ముందు మన నాయకుడు పిశాచం. కాని ఈ ముద్ర తర్వాత మనం క్రీస్తు అనే నాయకునికి చెందుతాం.

8. ఈ క్రియ మనకు వెలుగును ప్రసాదిస్తుంది. ఈ వెలుగు విశ్వాసం, దీనిద్వారా మనం ప్రభువునీ, విశేషంగా ఆయన మరణోత్థానాలనీ గ్రహిస్తాం - ఎఫే 5,14.

3. యోహాను భావాలు

ప్రభువు నికొదేమతో మాటలాడుతూ నరుడు దైవరాజ్యంలో ప్రవేశించాలంటే కొత్తగా జన్మించాలనీ, యింకా నీటినుండి ఆత్మనుండీకూడ పుట్టాలనీ సెలవిచ్చాడు - యోహా 8, 3-5, నీరూ ఆత్మా భక్తునికి క్రొత్తపుట్టువు నిస్తాయి, ఈ క్రొత్త పుట్టువు ప్రభువు మరణిశోత్తానాలద్వారా సిద్ధిస్తుంది. ప్రభువుని సిలువమీదికెత్తి వధిస్తారు. ఆ మరణం ద్వారా భక్తులు నాశానికితప్పి నిత్యజీవం పొందుతారు. అనగా సిలువమీద చనిపోయిన క్రీస్తుని విశ్వసించేవాళ్ళకు రక్షణం లభిస్తుంది —యోహా 8,14-15,

సిలువమీద ప్రభువు హృదయాన్ని తెరచారు. దాని నుండి నీళ్ళు స్రవించాయి. ఈ నీళ్ళు పవిత్రాత్మనీ, వరప్రసాదాన్నీ జ్ఞానస్నానాన్నీ సూచిస్తాయి —19,34. ఇంకా ప్రభువు జీవజలాన్ని కూడ పేర్కొన్నాడు - 7, 39. ఆయన సమరయ స్త్రీకి ఇస్తానని చెప్పిన జలంకూడ ఇదే - 4,10, యోహాను దృష్టిలో ఈ జలం ఆత్మకు చిహ్నం - జ్ఞానస్నాన జలాలద్వారా మనం ఈ యాత్మను పొందుతాం.

4. ఆపోస్తలుల చర్యలు వర్ణించిన తీరు

ఆత్మదిగివచ్చాక పేత్రు యెరూషలేములో బోధించాడు. ఆ బోధ వినిన యూదులు తమ పాపాల కొరకు పశ్చాత్తాపపడి క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందారు - అచ 2,37 41. ఈ రీతిగనే ఈ గ్రంథం ఇంకా చాలమంది భక్తుల జ్ఞానస్నానాలను పేర్కొంటుంది.