పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆత్ముదు ఎప్పడూ భక్తులను ప్రేషిత సేవకు పంపుతూనే వుంటాడు. అతడు ఫిలిప్పని రథమెక్కిపోతూన్నయితియోపీయుని దగ్గరికి పంపాడు - అ.చ.8,29. పేత్రుని అన్యజాతివాడైన కొర్నేలివద్దకు పంపాడు - 10, 19–20, సౌలు బర్నబాలను అన్యజాతి ప్రజలకు బోధచేయడానికి పంపాడు - 13,2-4 అసలు తొలినాటి ప్రేషితుల వేదబోధ అంతా దేవుని ఆత్మయొక్క శక్తితోనే జరిగింది. ఆత్మ పౌలుచే ఆసియా, బితూనియా రాష్ట్రాల్లో వేదబోధ చేయించనీయలేదు. మాసెడోనియాలో చేయించింది - అ,చ, 16,6,7,9.

పౌలు ప్రేషితుడుగా వ్యవహరించడానికి పిలువబడినవాడు. సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడినవాడు - రోమా 1,1. ఆత్మ ఎల్లవేళలా పిలువబడినవారిని వేదబోధకు పంపుతూంటుంది.

క్రీస్తు శిష్యులమీదికి ఊదిన ఊపిరి వారిని వేదబోధకు పంపింది - యోహా 20,22, ఈ ఊపిరి పవిత్రాత్మే మొదట దేవుడు మట్టిముద్దలోనికి గాలిని వూదగా సృష్టి జరిగింది. ఆదాము ఆవిర్భవించాడు - ఆది 2,7. క్రీస్తు శిష్యులమీదికి వూదిన గాలి నూత్న సృష్టిని జరిగిస్తుంది. ఈ నూత్న సృష్టి క్రైస్తవ ప్రపంచమే. క్రీస్తు తనతో వుండడానికీ, సువార్తా ప్రకటనకు పంపడానికి పండ్రెండు మందిని ఎన్నుకొన్నాడు - మార్కు 3, 14 ప్రేషితులు ప్రధానంగా సువార్తాబోధకు వెళ్ళేవాళ్ళు. కాని ఈ కార్యం జరిగేది మాత్రం ఆత్మద్వారానే.

2. ప్రేషితులు ఉత్థాన క్రీస్తునిగూర్చి బోధించారు. కాని ఈ బోధనాకార్యం ఆత్మశక్తివల్లనే జరిగింది. ఆత్మ శక్తివల్లనే వాళ్ళు అన్యజనులను దేవునికి విధేయులను జేయగలిగారు - రోమా 15,19. ఆత్మ క్రీస్తుని లోకానికి తెలియజేస్తుంది. ఆత్మ ప్రోద్భలంవల్లనే ప్రేషితులు క్రీస్తుని గూర్చి బోధించారు - అచ 4,31. నిజమైన వేదబోధ ఎప్పడూ ఆత్మ ప్రేరణం వల్లనే జరుగుతుంది.

పౌలు విలువలేని ఓ మట్టిపాత్రలాంటివాడు. కాని ఆ పాత్రలో గొప్ప సంపద వుంది. ఆ సంపద క్రీస్తు సందేశమే. అతడు ఆ సంపదను లోకానికి పంచిపెడతాడు - 2కొ 47. అతడు స్వయంగా బలహీనుడు. కాని అతని బలహీనతను ఆధారంగా జేసికొని ఆత్మ తన శక్తిని చూపిస్తుంది. అతని ద్వారా క్రీస్తు సందేశాన్ని విన్పిస్తుంది - 1కొ 3,13.

3. పౌలు మొదలైన తొలినాటి భక్తులు బోధించిన క్రీస్తు సందేశాన్ని తిమోతి జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు. అది పారంపర్య బోధ. కాని ఆత్మశక్తివల్లనే అతడు ఆ బోధను కల్లీలేకుండా పదిలపరచగలిగాడు. కల్లీ లేకుండా ఇతరులకు అందించగలిగాడు