పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పౌలు మరో తావలో, మనం దేవుని పుత్రులం గనుక దేవునికి వారసులం అని నుడివాడు. మన వారసత్వమైన మోక్షాన్ని మన కిప్పించేది పవిత్రాత్మే - రోమా 8, 16-17. ఇందుకు మనం ఆత్మకు ఎంతో కృతజ్ఞలమై యుండాలి.

ప్రార్ధనా భావాలు

1. ఆత్మడు పూర్వవేదంలో కన్పించే తీరుకీ నూత్న వేదంలో కన్పించే తీరుకీ చాలా తేడాలున్నాయి.

అతడు పూర్వవేదంలోని పుణ్యాత్ముల మీదికి ఓ గొప్ప శక్తిలా దిగివచ్చాడు. కాని నూతవేదంలోని స్నాపక యోహాను మీదికి, క్రీస్తుమీదికీ, శిష్యుల మీదికీ ఓ వ్యక్తిగా దిగివచ్చాడు.

పూర్వవేదంలో భక్తులు ఆత్మవరాలు పొందారేగాని అతన్ని ఓ వ్యక్తినిగా పొందలేదు. నూత్నవేదంలో ఆత్మ భక్తులమీదికి ఓ వ్యక్తిగా వేంచేసివచ్చి వాళ్ళకు తన వరప్రసాదాలను దయచేసింది.

పూర్వవేదంలో పవిత్రాత్ముడు ప్రవక్తలకు తన వెలుగును ప్రసాదించాడు. కాని నూత్నవేద భక్తుల్లో అతడు ఓ దేవాలయంలోలాగ వసిస్తాడు.

పూర్వవేదంలో ఆత్మ సాన్నిధ్యం తాత్కాలికమైంది. కాని నూత్నవేదంలో అది శాశ్వతమైంది.

2. బాసిల్ భక్తుడు ఈలా వాకొన్నాడు. "పరిశుద్ధ గ్రంథం ఆత్మనుగూర్చి చాల తక్కువగా చెప్తుంది. కనుక భక్తులుకూడ ఆత్మనుగూర్చి ఎక్కువగా మట్లాడరు. మనం ఆత్మను పూర్ణంగా అర్థంచేసికొనేదీ, అనుభవానికి తెచ్చుకొనేదీ మోక్షంలోనే".కనుక ఈ లోకంలో వున్నంతవరకు ఆత్మ మనకు చాలవరకు అర్థంకాని దైవరహస్యంగానే వుండిపోతుంది.

19. ప్రేషిత సేవ చేయించే ఆత్మ

1. ప్రేషిత సేవ ద్వారా ఆత్మ శ్రీసభను వ్యాప్తిజేస్తుంది. అన్ని దేశాల్లోను అన్ని కాలాల్లోను శ్రీసభ నెలకొనేలా చేస్తుంది. పెంతెకోస్తునాడు ఆత్మ శిష్యులమీదికి నాలుక రూపంలో దిగివచ్చిందని వింటున్నాం - అచ 2,3, నాలుకద్వారా మాట్లాడతాం, సమాచారం తెలియజేస్తాం. కనుక నాలుకలా వచ్చిన ఆత్మ మనం లోకానికి క్రీస్తుని గూర్చి సమాచారాన్ని అందించేలా చేస్తుంది.