పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భయపడిపోయిన పేత్రు ఇప్పడు మహాసభయెదుట ధైర్యంగా నిలిచి క్రీస్తునామం మీదుగానే ఈ యద్భుతాన్ని చేసానని సాక్ష్యంబలికాడు - 4,8. ఆపిమ్మట ఈ సంఘటనను పురస్కరించుకొని క్రైస్తవసమాజంవాళ్లంతా ఓతావులో గుమిగూడి ప్రార్ధనంచేసారు. ఆత్మవాళ్లున్న తావు కంపించేలాచేసింది. అటుపిమ్మట శిష్యులు ఆత్మ శక్తివల్ల క్రీస్తునుగూర్చి ధైర్యంగా బోధింపసాగారు 4,31. అటుతరువాత అపోస్తలులు చేసే అద్భుతాలు చూచి కన్నుగుట్టి మహాసభవాళ్లు మళ్లా పేత్రు మొదలైన నాయకులను పిలిపించారు. అపుడు పేత్రు "మేము మనుష్యులకుగాక దేవునికి లోబడాలి. మేమూ పరిశుద్దాత్మక్రీస్తు ఉత్తానానికి సాక్షులంగా వున్నాము" అని చెప్పాడు -- 5, 32.

శిష్యులు నానాభాషల్లో మాటలాడ్డంద్వారా, ప్రవచనం చెప్పడం ద్వారా క్రీస్తుకు సాక్షంగానిలచారు. కాని యివిరెండు ఆత్మ యిచ్చిన వరాలే. కనుక ఆత్మే వాళ్లను సాక్షులనుగాజేసింది అనాలి. అపోస్తలులు అన్యభాషల్లో మాటలాడారు - 2,6. అలాగే ఎఫేసులోని శిష్యులూ అన్యభాషల్లో మాటలాడారు - 19,6. అగబు ప్రవక్త యెరూషలేములో రాబోయే కరవును ముందుగానే ప్రవచనంద్వార సూచించాడు - 11,28. పౌలును యెరూషలేములో బంధిస్తారనీ అతడక్కడ శ్రమలనుభవిస్తాడనీ ముందుగానే యెరింగించాడు - 21,11.

పైగా ఆత్మ ఆ తొలినాటి పాలస్తీనాదేశంలోని క్రైస్తవసమాజానికి ఆదరణనిచ్చింది - 9,81. అంతియోకయలోని క్రైస్తవులకు ఆనందాన్ని అనుగ్రహించింది - 13,52. క్రీస్తు సందేశాన్ని ప్రతిఘటించినవాళ్లు ఆత్మను ప్రతిఘటించినట్లుగానే భావింపబడతారు. అందుకే సైఫను తన విరోధులనుజూచి "మీరు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు" అని నిందించాడు - 7,51.

5. సమాజ నాయకులు ఆత్మతో నిండుకొని వుండేవాళ్లు

తొలిసమాజంలోని నాయకులందరు ఆత్మతో నిండుకొనివున్నవాళ్లే. సంఘపెద్దలుగా వ్యవహరించిన డీకనులు లేక పరిచారకులు ఈలా ఆత్మతో నిండుకొనినవాళ్లే - 6, 3,5. సైఫను ఆత్మచేత నిండుకొనినవాడై వేదసాక్షి మరణానికి సంసిద్దుడయ్యాడు - 7.55. పాలు స్నేహితుడైన బర్నబా ఆత్మతో నిండుకొనిన సత్పురుషుడు – 11,24. పౌలుకూడ జ్ఞానస్నానం పొందినవెంటనే ఆత్మచేత నింపబడ్డాడు - 9, 17 ఈలా ఆత్మచేత నింపబడినవాళ్లు గనుకనే, ఈ నాయకులు ఆ తొలిరోజుల్లో అంతకృషి చేయగలిగారు.