పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. ఆత్మ ప్రేషితులను నడిపించింది

ఆత్మ పేషితులను ప్రేషితకార్యానికి నడపించుకొని పోతుంది. ఫిలిప్పను ఇతియోపీయుని యొద్దకు నడపించుకొని పోయింది—8,29. ఇతియోపీయుడు క్రీస్తును అంగీకరించి జ్ఞానస్నానంపొందాక ఫిలిప్పను మళ్ల ఆజోతుపట్టణానికి తీసికొనివెళ్లింది8,39. ఆలాగే పేత్రుని కొర్నేలియొద్దకు నడిపించుకొని పోయింది - 10,19;11,12.

ఆత్మ అంతియోకయ సమాజంనుండి సౌలును బర్నబాను తన పనికోసం ప్రత్యేకపరచుకొని మొదట ప్రేషిత ప్రయాణానికి తీసికొని పోయింది - 13,2-4. రెండవ ప్రేషిత ప్రయాణంలో పౌలును బితూనియా ఆసియారాష్ట్రాల్లో వాక్యం బోధింపనీయలేదు. నేరుగా మాసెడోనియాకు నడిపించుకొనివెళ్లింది - 16,6-7. పౌలు మూడవ ప్రేషిత ప్రయాణంలో వుండగా యెరూషలేములో బాధలు శ్రమలు అతనికోసం కాచుకొనివున్నాయని ముందుగానే యెరుకపరచింది - 20, 22-23.

యెరూషలేము మహాసభలో, గ్రీకు క్రైస్తవులు మోషే యిచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించనక్కరలేదని నిర్ణయాన్నిచేయించిందిగూడ ఈ యాత్మే - 15,29. ఎఫేసు శ్రీసభకు పెద్దలను నిర్ణయించిందీ ఆత్మే–20,28 ఈలా ఆత్మ తొలినాటి క్రైస్తవులను ప్రేషితకార్యానికి నడపించుకొనిపోయేది. వారికి త్రోవచూపించేది. నిర్ణయాలు చేసిపెట్టేది.

7. తొలిసమాజంలోని అవకతవకలు

తొలినాటి క్రైస్తవసమాజాన్ని ఆత్మే నడపించిందన్నాం. ఐనా ఆ సమాజంలోగూడ చాల అవకతవకలుండేవి. విశేషంగా తగాదాలుండేవి. హెబ్రేయ యూదులు గ్రీకుమాటలాడే యూదుల విధవలను చిన్నచూపచూచారు. వాళ్లను అన్నంవడ్డించడం మొదలైన పరిచర్యల్లో పాల్గొననీయలేదు. అందుచేత ఓ తగాదా వచ్చింది. పేత్రు ఈ తగాదాను పరిష్కరించి సమాజపరిచర్యకై డీకనులను నియోగించాడు -6,1.

అననీయ సఫీరా పొలం అమ్ముకొని, డబ్బుమిగుల్చుకొని పేత్రునెదుట బొంకులాడారు. దానిఫలితాన్ని వెంటనే అనుభవించారు –5,3.9. మార్కును వెంటతీసుకొని వెళ్లాలా వద్దా అన్న అంశంపై రెండవ ప్రేషితప్రయాణంలో పౌలు బర్నబా తీవ్రంగా పోట్లాడుకొన్నారు. ఆ పిమ్మట వాళ్లిద్దరూ మల్లా ఒకరితో వొకరు కలువలేదు. ఎవరిత్రోవనవాళ్లు వెళ్లిపోయారు - 15,39.