పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిస్రాయేలీయులకు ధర్మశాస్త్రం అతిముఖ్యమైంది. ఈ ధర్మశాస్త్రం యిస్రాయేలు సమాజంలో సాంఘికన్యాయాన్ని పెంపొందించడంకోసం ఎన్నో విధులు జారీ చేసింది. ఉదాహరణకు ఓవిధి యిది. "పేదకూలివాణ్ణి పీడించవద్దు. సూర్యుడు అస్తమించకమునుపే ఏనాటికూలి ఆనాడు వాడికి ముట్టజెప్పాలి. వాడు నిరుపేద కనుక ఆ కూలికోసం కనిపెట్టుకొని ఉంటాడు. వాడు నాకు మొరపెడితే నేను మిమ్మ దోషులనుగా గణిస్తాను" - ద్వితీ 24, 14-15.

యూదులు సాంఘిక న్యాయాన్ని ఉల్లఘించినపుడెల్ల ప్రవక్తలు వాళ్ళను మందలిస్తూండేవాళ్లు. కనుకనే యెషయా ప్రవక్త ఈలా హెచ్చరించాడు.

"మీ యొడలు కడుగుకొని శుద్ధిచేసికొనండి
ఇక నాయెదుట దుష్కార్యాలు చేయకండి -
మీ పాపపుపనులనుండి వైదొలగి
సత్కార్యాలకు పూనుకొనండి
న్యాయాన్ని పాటించండి
పీడితులకు మేలు చేయండి
అనాథుల హక్కులు నిలబెట్టండి
వితంతువులను ఆదుకొనండి" -1, 16-17
ఇంకా ఆమోసు ప్రవక్త ఈలా మందలించాడు.
“నీతి ఓ నదిలాగ పొంగిపారాలి
న్యాయం ఓ జీవనదిలాగ ప్రవహించాలి? - 5, 24

2. నూత్నవేదం. మామూలుగా మనం క్రీస్తు బోధలూ, క్రైస్తవ మతమూ ఆత్మకు సంబంధించినవి అనుకొంటాం. మనమతం శారీరకావసరాలను పట్టించుకోదు అనుకొంటాం. కాని నరుడ్డి ఈలా శరీరంగాను ఆత్మగాను విభజించడం పొరపాటు. క్రీస్తు హీబ్రూ జాతికి చెందినవాడు. హీబ్రూ ప్రజలకు నరుళ్ళే దేహమూ ఆత్మ అనేవి రెండున్నాయని తెలియనే తెలియదు. ఈ భావం మనకు గ్రీకు ప్రజలనుండి వచ్చింది. యూదులకు తెలిసిందల్లా నరుడు ఏకవ్యక్తి అని. అనగా పూర్వవేదం నరుడ్డి గూర్చి మాట్లాడినపుడెల్ల దేహమూ ఆత్మా రెండిటినీ ఉద్దేశిస్తుంది. ఇక క్రీస్తు కూడ నరుని దేహాత్మలను రెందిటిని లెక్కలోనికి తీసికొనే బోధించివుండాలి. దేహానికి సంబంధించిన కూడూ గుడ్డా యిలూ వాకిలీ మొదలైనవాటిని అతడు ఉపేక్షించి వుండడు. కనుక క్రైస్తవమతం శారీరకావసరాలను ఉపేక్షించేది కాదు.