పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మామూలుగా ప్రభువు తన భక్త సమాజానికి ప్రవచన వరాన్నీ, ఆ వరాన్ని గుర్తించే వివేచనా వరాన్నీగూడ ప్రసాదిస్తుంటాడు. ఈనాడు మన సమస్య ప్రవచనాన్ని ఏలా పరిశీలించి చూడాలా అన్నదికాదు. అసలు ప్రవచనం చెప్పేవాళ్ళే కరువైపోయారు. కనుక పెంతెకోస్తు భక్తులు ఈ వరంకోసం పవిత్రాత్మను ప్రార్థించాలి. కొందరు దైవసందేశాన్ని విన్పించి భక్త సమాజాన్ని ప్రోత్సహించాలని వేడుకోవాలి. ప్రవచనం చక్కని వరం. ప్రవక్త ఓ స్నేహితుళ్ళాంటివాడు. మన మేలు కోరి దైవవాక్కుతో మనలను ప్రోత్సహించేవాడు. ఈలాంటి ప్రోత్సాహకుల మయ్యే భాగ్యం మనకుగూడ అబ్బితే ఎంత బాగుంటుంది!

17. ప్రేషితరంగం

1. పౌలు 1 కొరింతీయులు 12, 28లోను, రోమీయులు 12,7లోను ఎఫేసీయులు 4,11లోను ప్రేషిత వరాన్ని పేర్కొన్నాడు. ప్రేషితులంగా పని చేయడమనేది ఆత్మయిచ్చే వరాల్లో ఒకటి. మన క్యాతలిక్ సమాజంలో చాలమంది, గురువులూ మఠకన్యలూ మాత్రమే ప్రేషితులనీ, గ్రుహస్తులు ప్రేషితులుకారనీ భావిస్తుంటారు. అందుకే మనవాళ్ళు కొంతమంది మన మతాన్ని "స్వాములవారి మతం" అని అంటుంటారు. కాని ఇది పెద్ద పొరపాటు. గురువులూ మరకన్యలతో పాటు మన గృహస్థలు కూడ సువిశేష సేనకు పూనుకోవాలి. విశేషంగా మన ఉపదేశులూ ఉపాధ్యాయులూ ఈ సేవ అమితంగా చేయాలి.

2. పూర్వవేద ప్రజలు ఎన్నిక ద్వారా ప్రభుప్రజలయ్యారు. సీనాయి కొండ వద్ద ప్రభువు యిప్రాయేలుతో ఒడంబడిక చేసికొన్నాడు. వాళ్ళ యావేను ఆరాధించే పవిత్రప్రజా, యూజకరూప రాజ్యమూ అయ్యారు - నిర్గ 19, 5-6. అప్పటి నుండి ఆ ప్రజలు సకలజాతులకూ యావే ప్రభువును ఎరిగించడం తమ బాధ్యత అనుకొన్నారు. ఇక పూర్వవేద ప్రజలకు ఎన్నిక ఏలాంటిదో నూత్నవేద ప్రజలమైన మనకు జ్ఞానస్నానం ఆలాంటిది. దాని ద్వారా మనం కూడ ప్రభువు పవిత్రప్రజలమూ, అతన్ని పూజించే యాజకరూప రాజ్యమూ ఔతాం - 1 పేత్రు 2,9-10. ఆ యిప్రాయేలు లాగే మనం కూడ క్రీస్తుని లోకానికి తెలియజేయాలి, అతని అద్భుత కృత్యాలను ప్రకటించాలి. క్రీస్తులోకి జ్ఞానస్నానం పొంది ఆ ప్రభువులోనికి ఐక్యం కావడంవల్ల అతని లక్షణాలు మనకు కూడ సంక్రమిస్తాయి. ఆ క్రీస్తు ప్రేషితుడు. అనగా తండ్రిచే పంపబడినవాడు. అతనిలాగే మనంకూడ ప్రేషితులంగా మెలగాలి - యోహా 20,21.