పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలా మనలను పెడత్రోవ పట్టిస్తుంది. పైగా పిశాచం ఎవరైనా ఓ మంచిపని చేసినపుడుగూడ మనం అదేదో చెడ్డకార్యం అని శంకించేలా చేస్తుంది. క్రీస్తు అన్ని అద్భుతాలు చేసినాగూడ యూదుల పెద్దలు అతడు పిశాచ నాయకుని సహాయంతోనే ఆ యద్భుతాలన్నీ చేస్తున్నాడని భావించారు - మార్కు 3,22. ఈలాగే మనంకూడ పిశాచ ప్రబోధితులమై ఇతరులు చేసిన మంచిపనికిగూడ చెడుగును ఆరోపిస్తాం. ఈలా పిశాచ శోధనలు బహువిధాలుగా వుంటాయి. ఈలాంటప్పుడు దురాత్మ మనలను పరికొల్పే తీరును గుర్తించడం అత్యవసరం కదా!

2. పౌలు "ఆత్మను ఆర్చివేయవద్దు, సమస్తాన్నీ పరీక్షించి తెలుసుకొనండి" అన్నాడు - 1 తెస్స 5,19,22. యోహాను కూడ తన మొదటి జాబులో "ఆ యాత్మలు దైవసంబంధమైనవో కావో పరీక్షించి చూడండి" అన్నాడు – 4,1. ఈలా పరీక్షించి చూచే శక్తి వివేచనం. కొందరిలో ఈ శక్తి గొప్పగా వుంటుంది. ఇది పవిత్రాత్మ యిచ్చే ప్రత్యేకవరం, దీన్నే పౌలు 1కొ 12, 10లో పేర్కొన్నాడు. ఈ శక్తికలవాళ్ల తమ్మ పలానా కార్యం చేయమని పవిత్రాత్మే ప్రేరేపిస్తుందో లేక పిశాచమే ప్రేరేపిస్తుందో వెంటనే గుర్తుపడతారు. కొలదిగానో గొప్పగానో ఈ వరం మనకందరికీ అవసరమే. ఇదిలేందే సరియైన ఆధ్యాత్మిక జీవితం జీవించలేం. కనుక మనం ఈ వరంకోసం ఆత్మను ప్రార్థించాలి.

3. కాని ఈ వివేచనాన్ని పాటించడం ఏలా? ప్రభువు ఫలాన్నిబట్టి చెట్టును నిర్ణయించవచ్చు - అనగా వారివారి ప్రవర్తలను బట్టి నరులను నిర్ణయించవచ్చు అన్నాడు - మత్త 7, 15-20. ఇది సర్వత్ర వర్తించే గొప్ప సూత్రం. మంచి పండుకాస్తే అది మంచి చెట్టు. చెడుపండు కాస్తే అది చెడ్డ చెట్టు. ఉమ్మెత్తకాయ కాసేది పాడు చెట్టు. మామిడికాయ కాసేది మంచి చెట్టు. ఇక, మన పండ్లు మనం చేసే పనులే. కనుక మంచిపనులు చేసేవాడు మంచివాడు. చెడుపనులు చేసేవాడు చెడ్డవాడు. లోకంలో మన జీవితానికి గాని ఇతరుల జీవితానికి వర్తించే ప్రాథమిక సూత్రం ఇది.

మనచేత మంచిపండు కాయించేది పరిశుద్దాత్మే పౌలు ఆత్మఫలాలను తొమ్మిదింటిని పేర్కొన్నాడు. వాటి వివరణాన్ని మీదటి అధ్యాయాల్లో విపులంగా పరిశీలించి చూద్దాం. ఒకోమారు ఈ ఫలాలుకూడ మన పాపకార్యాలతో మిళితమై వుంటాయి. కనుక వాటిని గుర్తుపట్టడం అంత సులభం కాదు.

4. ఆత్మ నడిపించే వాళ్లల్లో రెండుమూడు ప్రధాన లక్షణాలు కన్పిస్తాయి. ఇవి ఆత్మ మన జీవిత వృక్షంమీద కాయించిన పండ్లు అనాలి. మొదటిది, ప్రభుని ప్రగాఢంగా విశ్వసించడం. క్రీస్తుని అంగీకరించేలా చేసే ఆత్మ దైవసంబంధమైంది - 1 యోహా 4,2.