పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనుక ఈ యాత్మ మనలో పని చేస్తున్నట్లయితే మనం ఆ ప్రభుని నిండు హృదయంతో నమ్ముతాం. మన హృదయం కోరుకొనే ప్రధాన కోరికకూడ క్రీస్తే ఔతాడు - 2కొ 12,3. క్రీస్తుని అంగీకరించినవాళ్ళకు ప్రభువాక్యమైన బైబులుపట్ల ఆసక్తి శ్రద్దా కలుగుతుంది.

రెండవది, తండ్రి మనలను ప్రేమించేవాడని నమ్మడం. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళకు అన్ని సంఘటనలుకూడ అనుకూలంగానే పనిచేస్తాయి అన్నాడు పౌలు - రోమా 828. కనుక ప్రేమమయుడైన ఆ తండ్రి మనలను చేయి వదిలేవాడుకాదు అని నమ్మాలి.

మూడవది, వినయం, వినయంలేందే ప్రభువుకి ప్రియపడేలా జీవించలేం. వినయవంతులు పిశాచ శోధనలను వెంటనే గుర్తుపడతారు. పిశాచం మనలను పెడత్రోవ పట్టించకుండా వండాలన్నాగానీ, లేదా మనం ఇతరులు చేసిన మంచి పనికిగూడ చెడుగును ఆరోపించకుండా వుండాలన్నాగానీ వినయం అవసరం. ఇక, వినయమూ విధేయతా కలసిపోతూంటాయి. ఆత్మ నడిపించేవాళ్ళకు వినయమూ విధేయతా రెండూ భూషణాలుగా వుంటాయి.

16. ప్రవచన వరం

పౌలు “మీరు భాషల్లో మాటలాడాలని నాకోరిక. కాని మీరు ప్రవచనం చెప్పాలని నేను మరీ అధికంగా కోరుకొంటున్నాను" అన్నాడు - 1కొ 14,5. అతడు సేవా వరాల్లో ప్రవచనాన్ని ఘనంగా యెంచినట్లు కన్పడుతుంది - 1కొ 14,1. 1. ప్రవచనం అంటే యేమిటి? చాలమంది క్రైస్తవులు ప్రవచనం పూర్వవేదానికి సంబంధించిన వరం అనుకొంటారు. కాని ఇది విశేషంగా నూత్నవేదానికి చెందిన వరం. పేత్రు యెరూషలేములో చేసిన పెంతెకోస్తు మొదటి ఉపన్యాసంలో "అంత్యదినాల్లో నా యాత్మను మీ మీద కుమ్మరిస్తాను, మీ కుమారులూ కొమార్తెలూ ప్రవచనం చెప్తారు" అన్న యోవేలు ప్రవచనాన్ని ఉదాహరించాడు - అచ 2, 17. దీన్నిబట్టినూత్న వేదంలోని భక్తులకు ప్రవచనం సమృద్ధిగా లభిస్తుందని అర్థం చేసికోవాలి. అందుకే నూత్నవేదం చాల తావుల్లో ప్రవచనాన్ని పేర్కొంటుంది - 1తెస్స 5,20.

మాములుగా మనం ప్రవక్త అంటే భవిష్యత్తును తెలియజెప్పేవాడనో లేక రహస్యాలను వెల్లడిచేసేవాడనో భావిస్తాం, కాని ఇది పొరపాటు, ఆత్మ ప్రబోధంతో ప్రభు సందేశాన్ని విన్పించేవాడు ప్రవక్త, ఈ సందేశంకూడ తరచుగా వర్తమానానికి సంబంథించిందై వుంటుంది. ప్రవచనం ద్వారా ప్రభువు తన ప్రజలకు మూడు ఉపకారాలు చేస్తాడు.