పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. ముద్ర మరో ప్రతీక. తండ్రి క్రీస్తుకి ముద్ర వేసాడు - యోహా 6,67. ఆత్మ మనపై క్రీస్తు ముద్ర వేస్తుంది - ఎఫే 4,30.

6. చేయి, వ్రేలు ఇంకో ప్రతీక. క్రీస్తు దేవుని వ్రేలితో దయ్యాలను వెళ్ళగొట్టాడు — లూకా 11,20. అపోస్తలులు ప్రజలపై హస్తాలను చాచడం ద్వారా వారికి పవిత్రాత్మను దయచేసారు - అచ 8,17. ఇక్కడ చేయి, వ్రేలు దైవశక్తిని సూచిస్తాయి.

7. పావురం మరో సంకేతం. జ్ఞానస్నానానంతరం పవిత్రాత్మ పావురం రూపంలో క్రీస్తుమీదికి దిగివచ్చింది. మన దైవర్చానలో పావురం పవిత్రాత్మకు చిహ్నం. మెస్సియా ఆత్మశక్తిద్వారా నూత్న ప్రజలను తయారుచేస్తాడని పావురం భావం.

మనం ఈ నామాలనూ సంకేతాలనూ నిదానంగా ధ్యానించుకొని ఆత్మపట్ల భక్తిని పెంచుకోవాలి.

ప్రార్థనా భావాలు

ఇరెనేయస్ భక్తుడు ఈలా వ్రాసాడు. మనం జ్ఞానస్నానం స్వీకరించినపుడు ఆత్మద్వారా నూత్న జన్మను పొందుతాం. ఆత్మ మనలను క్రీస్తు దగ్గరికి చేర్చగా. క్రీస్తు తండ్రి దగ్గరికి చేరుస్తాడు. పిత మనకు అవినాశశక్తిని దయచేస్తాడు. క్రీస్తుద్వారా తప్ప ఎవడూ తండ్రిని చేరడు. తండ్రినిగూర్చిన జ్ఞానాన్ని ప్రసాదించేది సుతుడే. అలాగే ఆత్మద్వారా తప్ప ఏ నరుడూ దేవుని కుమారుని చేరలేడు. క్రీస్తుజ్ఞానాన్ని ప్రసాదించేది ఆత్మ ఒక్కటే.

2. ఆత్మ దేవుని క్రియాశక్తి

1. ఆత్మకు హీబ్రూ భాషలో రువా అని పేరు. ఈ శబ్దానికి చాల అర్ధాలున్నాయి. 1. రువా అంటే గాలి, ఊపిరి అని అర్థం. 2. నరునిలోని జీవశక్తికీ తెలివికీ సంవేదనలకూ రువా అని పేరు. 3. దేవుని జీవానికీ క్రియాశక్తికీ గూడ రువా అని పేరు. కనుక ఈ పదం చాల విస్తృతభావాలు కలది.

దేవుని క్రియాశక్తియైన ఆత్మ కొందరు యుద్ధవీరుల మీదికి దిగివచ్చినట్లుగా పూర్వవేదంలోని న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతూన్నాం. ఆ యాత్మ ఒత్నీ యేలుమీదికి దిగివచ్చింది - 3,10. గిద్యోనుమీదికి దిగివచ్చింది - 6,34. యెప్తా మీదికి దిగివచ్చింది - 11,29. అలాగే సంసోనును ఆవేశించింది - 14,19. సౌలుమీదికి దిగివచ్చి అతనికి ఆవేశం పుట్టించింది - 1సమూ 10, 5-6. దావీదుమీదికి దిగివచ్చి అతనిలో వుండిపోయింది – 16,13, ఈ వీరులమీదికి దిగివచ్చిన ఆత్మ వీళ్ళను శత్రువులతో యుద్ధం చేయడానికి ప్రేరేపించింది.