పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆత్మ ప్రవక్తలమీదికి గూడ దిగివచ్చింది. ప్రభువు బాధామయ సేవకుని ఆత్మతో నింపాడు - యెష42,1. పేదలకు శుభవార్తను ప్రకటించే ప్రవక్తను ఆత్మతో నింపాడు - 61.1. ఆత్మ ప్రేరణంతో వీళ్లు దైవసందేశాన్ని ఎరిగించారు.

కడన మెస్సియాకూడా ఆత్మను పొందినవాడే
“దేవుని ఆత్మ అతనిపై నిలుస్తుంది
అది విజ్ఞాన వివేకాలను దయచేసే ఆత్మ
దూరదృష్టినీ బలాన్నీ ప్రసాదించే ఆత్మ
దైవజ్ఞానాన్నీ దైవభీతినీ దయచేసే ఆత్మ" - యొష 11,2.

2. పూర్వవేదంలో ఆత్మ దేవుని క్రియాశక్తిగా మాత్రమే కన్పిస్తుంది. కాని నూత్నవేదంలో ఈయాత్మడు ఓ వ్యక్తిగా కన్పిస్తాడు. ఓ వ్యక్తిగానే అతడు క్రీస్తుమీదికి దిగివచ్చాడు - యోహా 1,33. ఈ క్రీస్తు మహిమను పొంది తండ్రి నుండి ఆత్మను స్వీకరించాక మనకందరికీ ఆ యాత్మను ప్రసాదిస్తాడు - యోహా 7,39.

పూర్వవేదంలో ఆత్మవరాలున్నాయేకాని ఆత్మడు ఓ వ్యక్తిగా కన్పించడు. నూత్నవేదంలో అతడు ఓ వ్యక్తిగాగూడ కన్పిస్తాడు. మన హృదయాల్లో వసిస్తూ మనలను దివ్యలను చేస్తాడు.

నేడు మనం జ్ఞానస్నానం పొందినపుడే ఆత్మను స్వీకరిస్తాం. జ్ఞానస్నాన సమయంలో ఆత్మ మన హృదయాలపై క్రీస్తుని ముద్రవేస్తుంది - ఎఫే 1,13-14.

దేవుడు తన ఆత్మద్వారా మనలను తన దగ్గరికి ఆకర్షించుకొంటాడు - యోహా 6,44. ఆత్మ మనలను దేవుని దగ్గరికి చేరుస్తుంది. మనలను దేవుని రాజ్యంలోకి ప్రవేశపెడుతుంది.

ప్రార్ధనా భావాలు

1. వేదపండితులు ముగ్గురు దైవవ్యక్తులకు మూడు ప్రత్యేక కార్యాలు ఆరోపించారు. తండ్రి సృష్టి చేసేవాడు. కుమారుడు మనలను పాపాన్నుండి రక్షించేవాడు. ఆత్మడు మన హృదయాల్లో వసిస్తూ మనలను పవిత్రపరచేవాడు. అతడు ప్రధానంగా హృదయనివాసి. మన హృదయంలోనే వుండే యీ దైవశక్తిని మనం నిత్యం గుర్తిస్తుండాలి. 2. యూదుల రబ్బయుల బోధల ప్రకారం ఆత్మడు మన హృదయాల్లో మాట్లాడతాడు, విలపిస్తాడు, దుఃఖిస్తాడు, సంతోషిస్తాడు, మనలను మందలిస్తాడు, హెచ్చరిస్తాడు,