పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నిన్ను సృజించినవాడే నీకు భర్త

సర్వశక్తిమంతుడైన ప్రభువని అతనికి పేరు

యిస్రాయేలు పవిత్ర దేవుడు నిన్ను రక్షిస్తాడు

విశ్వధాత్రికి దేవుడని అతనికి పేరు

నీవు భర్తచే పరిత్యక్తయై

దుఃఖాక్రాంతురాలైన పడుచుభార్యలాంటిదానివి

కాని ప్రభువిపుడు నిన్ను మరల చేపడతాడు

అతడు నీతో ఈలా పల్కుతాడు

నేను నిన్నొక క్షణకాలం విస్మరించాను

గాధానురాగంతో నిన్నిపుడు మరల స్వీకరిస్తాను

కోపం వలన ఒక్క క్షణకాలం

నా మొగం నీ నుండి మరుగుజేసికొన్నాను

కాని యిపుడు శాశ్వత కృపతో నిన్ను కరుణిస్తాను

అని నీ రక్షకుడైన ప్రభువు పల్కుతున్నాడు

పర్వతాలు గతిస్తే గతించవచ్చుగాక,

తిప్పలు చలిస్తే చలించవచ్చుగాక

నా కరుణ మాత్రం నిన్ను విడనాడదు

సమాధాన పూర్వకమైన నా నిబంధనం తొలగిపోదు

అని నీమీద నెనరుజూపే ప్రభువు పల్కుతున్నాడు."

ఇవి చాల గొప్ప వాక్యాలు, బాబిలోనియా ప్రవాసంలో అలమటిస్తున్న యిస్రాయేలీయులు భర్త విడనాడితే దుఃఖిస్తూన్న పడుచు భార్యలా వున్నారు. ప్రభువు తన వధువు పాపాలకు ఆమెను ఒక్క క్షణకాలం విడనాడాడు. అదే 70 యేండ్ల బాబిలోనియా ప్రవాసం. కాని యావే యిప్రాయేలు వధువు దుఃఖాన్ని చూచి ఆమెను మరల స్వీకరిస్తాడు. ఆమెతో మళ్ళా నిబంధనం చేసికొంటాడు. కొండలు కదిలితే కదులుతాయేమోగాని తన వధువుపట్ల అతనికున్న ప్రేమ మాత్రం చలించదు. ఇది ప్రవక్త భావం.

ఇంతవరకు మనం పేర్కొన్న పూర్వవేద భావాలు ఇవి. 1. యిస్రాయేలీయులు ప్రభువుని ప్రేమించినంతకాలం భర్తపట్ల అనురాగంజూపే భార్యలాంటి వాళ్ళ 2. అతన్ని విడనాడి అన్య దైవాలను కొలిచినంతకాలం వ్యభిచారిణియైన భార్యలాంటివాళ్ళు 3. ప్రభువు ఆమె పశ్చాత్తాపాన్ని జూచి ఆమె పాపాలను మన్నిస్తాడు. ఆ మీదట ఆమె అతనిపట్ల విశ్వాసయోగ్యంగా మెలుగుతుంది.