పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని చెప్తుంది - 4,1. ఇంకా ఈ పుస్తకం ధర్మశాస్త్ర మార్గంలో నడచేవాళ్లు సంపూర్ణ శాంతి ననుభవిస్తారని గూడ వాకొంటుంది - 3,13. ఇతర జాతులకు ధర్మశాస్త్రం లేదు. కనుకనే మరో కీర్తనకారుడు

"ప్రభువు తన వాక్కుని తన ప్రజలకు విన్పిస్తాడు
తన కట్టడలను యిస్రాయేలీయుల కెరిగిస్తాడు
అతడు అన్యజాతులకు ఈ కార్యం చేయలేదు
అతని ధర్మవిధులు వారికి తెలియవు"
అని పల్మాడు - 147,19-20.

యూదులు ఈ ధర్మశాస్తాన్ని తుచ తప్పకుండ పాటించాలి. దానినుండి వైదొలగితే వారికి వినాశం తప్పదు. దానిని అనాదరం చేస్తే వారికి ప్రవాసం ధ్రువం, చివరికి యూదులు న్యాయశాస్త్రాన్ని మీరనూ మీరారు, బాబిలోనియా ప్రవాసానికి వెళ్ళనూ వెళ్ళారు. ఐనా ఆ ప్రవాసదేశంలో గూడ ప్రభువు వారిని పూర్తిగా విడనాడలేదు. అక్కడ కూడ తాను వారిని ఆదుకోడానికి సిద్ధమయ్యాడు. కనుకనే అతడే తన ప్రవక్త ద్వారా

"ఎడారిలో ప్రభువుకి మార్గం సిద్ధం జేయండి
మరుభూమిలో మన దేవునికి రాజపథం తయారుచేయండి"

అని చెప్పించాడు - యెష40,3. తన ప్రజలను బాబిలోనియా ప్రవాసం నుండి మళ్ళా తీసికొనిరావడానికే ఈ మార్గం. ఈ సందర్భంలో ప్రభువే స్వయంగా

"ఎడారిలో బాటవేయిస్తాడు
కొండలగుండ మార్గం సిద్ధం చేయిస్తాడు" - 49,11.

3. రెండుమార్గాలు

బాబిలోనియా ప్రవాసానంతరం యూదుల్లో "రెండు మార్గాలు" అనే భావం ప్రచారంలోకి వచ్చింది. పూర్వవేదప నైతికాంశాలు సంగ్రహంగా ఈ రెండు త్రోవల్లో యిమిడి వున్నాయి. కనుక ఈ యంశాన్ని విపులంగా పరిశీలిద్దాం.

రెండు మార్గాలంటే మంచి త్రోవా చెడు త్రోవానూ, మంచి త్రోవ తిన్నగా వుంటుంది. ఇది జీవన మార్గం. ఈ తెరువు వెంట నడచేవాళ్ళు శాంతికాములు, నీతినియమాలు పాటించేవాళ్ళు సత్యసంధులు. కాని చెడుమార్గం వంకరటింకరగా వుంటుంది. ఇది వినాశమార్గం. ఈ బాటలో నడచేవాళ్ళు అవివేకులు, మూర్ఖులు పాపాత్ములు. వీళ్ళు అపాయానికి గురై మృత్యువువాత పడతారు. ఈ రెండు పథాల నుద్దేశించి కీర్తనకారుడు