పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక్కడ పిలాతు క్రీస్తు పట్ల మెలగిన తీరును సంగ్రహంగా పరిశీలించి చూడ్డం మంచిది. 1. మొదట, అతనికి క్రీస్తు విషయంలో జోక్యం కలిగించుకోవడం ఇష్టం లేదు. కనుక యూద నాయకులతో విూరు ఇతన్ని తీసికొని వెళ్ళి విూ చట్టప్రకారం విచారించండి అన్నాడు - యోహా 18,31. పిలాతుకి క్రీస్తుని కలసికోవడం ఇష్టం లేదు. కాని ప్రతి నరుడు వ్యక్తిగతంగా ప్రభువుని కలసికోవాలి. మన తరపున మరొకరు అతన్నికలసికోలేరు.

2. పిలాతుకి క్రీస్తు నిర్దోషి అని తెలుసు. అతన్ని విడిచిపెట్టాలనే కోరిక కూడ ఉంది. కాని యూద నాయకులకు దడిసాడు. కనుక పాస్క పండుగ నాడు ఒక ద్రోహిని వదలిపెట్టవచ్చు అనే అవకాశాన్ని వినియోగించుకొని ప్రభువుని విడిపిద్దాం అని పన్నాగం వేసికొన్నాడు, కాని యీ పన్నాగం బెడిసికొట్టింది - 18,39. క్రీస్తుని అంగీరించాలా లేక నిరాకరించాలా అనే సమస్య మనందరి జీవితంలోను ఎదురౌతుంది. లోక ప్రయోజనాలకు ఆశపడి ప్రభువుని విడనాడనివాడు ధన్యుడు.

3. పిలాతు క్రీస్తుని కొరడాలతో కొట్టించాడు. కొరడాదెబ్బలు తిన్న క్రీస్తుని చూచినపుడు యూదులకు జాలి కలుగుతుంది. అప్పడు తాను ప్రభువుని విడిపించవచ్చు గదా అనుకొన్నాడు. కొరడా శిక్ష ద్వారా సిలువ శిక్షను తొలగించవచ్చు అనుకొన్నాడు - 19,1. కాని యూదులు అతని చర్యను అంగీకరించలేదు. ఏ నరుడూ ఇద్దరు యజమానులను సేవించలేడు. ప్రభువనీ ఈ లోకాన్నీ రెండిటినీ సేవించలేడు. ఎన్నుకొంటే ప్రభువుని పూర్ణహృదయంతోనే ఎన్నుకోవాలి. లేకపోతే వదలివేయాలి.

4. పిలాతు ప్రభువుని నిజంగానే వదలిపెట్ట గోరాడు. ఐనా యూదులకు దడిసాడు. వాళ్లు "ఇతన్ని విడిచిపెడితే నీవు చక్రవర్తికి స్నేహితుడవు కావు. నేను రాజునని చెప్పకొనేవాడు చక్రవర్తికి విరోధి కదా" అన్నారు - 19,12. యూదులు తన విూద ఎక్కడ ఫిర్యాదు చేస్తారో, తన ఉద్యోగం ఎక్కడ ఊడుతుందో అని పిలాతు జంకాడు. ఉద్యోగం పోతుందన్న భయంతోనే అతడు క్రీస్తుకి మరణశిక్ష విధించాడు. కాని క్రీస్తుకు బదులుగా మరొకదాన్ని ఎన్నుకొనేవాడు ప్రభువు భక్తుడే కాడు.

పిలాతు తీర్పు చెప్పేంతసేపు క్రీస్తు నిబ్బరంగా ఉండిపోయాడు. అసలు తానే న్యాయాధిపతి, పిలాతు దోషి అన్నట్లుగా ప్రవర్తించాడు ప్రభువు. క్రీస్తు సిలువ విూద శ్రమలు అనుభవించేపుడు కూడ తానే బుద్ధిపూర్వకంగా సిలువను ఎన్నుకొన్నట్లుగా కన్పిస్తుంది. ఇతరులు అతన్ని సిలువ వేసినట్లుగా కన్పించదు. సిలువ మరణం తండ్రి రక్షణ ప్రణాళికలో ఓ భాగం కదా!