పిలాతు క్రీస్తుని విడిపిద్దామా వద్దా అని జంకుతూన్నాడు. "ఇతన్ని విడిచి పెట్టావంటే నీవు రోములోని చక్రవర్తికి స్నేహితుడివికావు" అని యూదులు అతన్ని బెదిరించారు. యూద నాయకులు తన మిూద చక్రవర్తికి ఫిర్యాదు చేస్తే తన ఉద్యోగమే ఊడవచ్చు. కనుక పిలాతు మరి యొక్కువగా భయపడ్డాడు.
7. పిలాతు క్రీస్తుకి సిలువ మరణాన్ని విధించడం - 19, 13-16
ఈ సంఘటనం మందిరం వెలుపల జరిగింది. పిలాతు విూద యూద నాయకుల వత్తిడి ఎక్కువైంది. అతడు తన ఉద్యోగం నిల్పుకోవడం కొరకు క్రీస్తుకి మరణశిక్ష విధించాలనుకొన్నాడు. కనుక తుదితీర్పు చెప్పడానికి న్యాయపీఠం మిూద కూర్చున్నాడు. దానికి గబ్బతా అని పేరు. అప్పడు మధ్యాహ్నం పండ్రెండు గంటల సమయం. ఆ సమయంలోనే యెరూషలేము దేవాలయంలో పాస్క గొర్రె పిల్లలను వధించడం మొదలుపెడతారు. ఆ సమయంలోనే మన పాస్క గొర్రెపిల్లమైన క్రీస్తుకి కూడ మరణశిక్ష విధిస్తారు. అసలు నిజమైన పాస్క గొర్రెపిల్ల అతడే.
పిలాతు రెండవసారి క్రీస్తుని ప్రజలు యెదుటికి తీసుకొని వచ్చాడు. మొదటిసారి కొరడాలతో కొట్టించి దీనుడుగా వున్న క్రీస్తుని ప్రజలకు చూపించాడు. ఇప్పుడు క్రీస్తుని రాజునిగా ప్రజలకు చూపిస్తున్నాడు, యూదులు క్రీస్తుని రాజునిగా అంగీకరించరని పిలాతుకు తెలుసు. ఐనా అతడు యూదులను గేలిచేస్తూ ఇదిగో విూ రాజు అని ప్రభువుని చూపించాడు, ఈ క్రీస్తులాంటి దుర్బలుడు విూ రాజు అని తెలియజేసి యూదులను అవమానపరచాలని అతని ఉద్దేశం.
కట్టకడన పిలాతు మిూ రాజును సిలువ వేయమంటారా అని యూదులను అడిగాడు. వాళ్ళు దుష్టబుద్ధితో మాకు కైజరు తప్ప మరొక రాజు లేడు అని అరిచారు. ఈజిప్టు నిర్గమనకాలం నుండి యూదులకు యావే ప్రభువే రాజు, అన్యజాతి రాజులు ఎంతమంది, ఎన్నియేండ్లు, తమ్ము ఏలినా యూదులు మాత్రం యావే ప్రభువే మాకు రాజు అని చెప్పకొనేవాళ్లు, ఆ ప్రభువు తన ప్రతినిధియైన మెస్సీయా రాజుని పంపుతాడనీ అతడు యిప్రాయేలీయుల తరపున యుద్దాలు చేస్తాడనీ నమ్మారు. ఆ సంప్రదాయాన్ని గాలికి వదలి ఇప్పడు రోమను చక్రవర్తి టిబేరియస్ను రాజుగా ఎన్నుకొన్నారు. మెస్సీయ రాజును తిరస్కరించారు. దీనితో దేవుడు పూర్వం సీనాయి కొండదగ్గర తమతో చేసికొన్న నిబంధనాన్ని కూడ తిరస్కరించారు. ఇంత ద్రోహం మరొకటిలేదు.
పిలాతు యూద నాయకుల వత్తిడికి లొంగిపోయి క్రీస్తుని వారికి అప్పగించాడు. కైజరే మా రాజు అన్న యూదనాయకులు కైజరు పనిని నిర్వహించడానికి, అనగా క్రీస్తుని సిలువ వేయడానికి, తీసికొనిపోయారు.