పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

2. మనుష్యావతారం ఓ జ్యోతి

పైన పేర్కొన్న ప్రభువు వాగ్దానాలు మహాభక్తులు కోరికలూ నెరవేరి మెస్సీయా విజయం చేసాడు, అతడు బేల్లెహేమలో నరశిశువుగా జన్మించాడు. కన్యమరియు అతన్ని కంది. వార్త శరీరధారియై మనమధ్య వసించాడు - యెహా 1,14. అతని పరిపూర్ణతనుండి మనం కృపవెంట కృపను పొందాం - 1,16. అనగా ప్రభువు మోషేద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్రం మొదటి కృప, ఇప్పడు ఈ మెస్సీయాను పంపడం ఆ ధర్మశాస్త్రంతో తుల్యమైన రెండవ కృప. ఆ మెస్సీయా పరిపూర్ణమైన కృపాసత్యాలతో మనమధ్య నివాస మేర్పరచుకొన్నాడు - 1, 14. ఈ వాక్యంలో "కృప" అంటే, తండ్రి కరుణతో మెస్పీయాద్వారా మనలను రక్షించడానికి పూనుకోవడం. "సత్యం" అంటే అతడు పూర్వం మనలను రక్షిస్తాను అని చేసిన ప్రమాణాన్ని ఈ మెస్సీయా ద్వారా నిలబెట్టుకోవడం.

బైబులు మనుష్యావతారాన్ని ఓ జ్యోతినిగా చిత్రిస్తుంది. దేవుడు వెలుగు. అతడు నరులు సమీపింపలేని తేజస్సులో వసిస్తూంటాడు - 1 తిమో 6,16. భక్తులు ఈ తేజస్సుకోసం తపించిపోయారు. “నీ వెలుగులో మేమూ వెలుగును చూస్తాం” అని ఉవ్విళ్ళూరిపోయారు - కీర్త 36,9. పుణ్యపురుషులు హృదయాల్లోని ఈ తృష్ణను తీర్చడానికి మెస్సీయా అవతరించాడు. కనుకనే అతడు "నేనే జగత్తునకు జ్యోతిని. నన్ననుసరించేవాడు చీకటిలో నడువడు" అని పల్మాడు - యోహా 8,12. ఈ వెలుగును దర్శించి భక్తులు తృప్తిచెందుతారు. ఎందుకంటే ఆ ప్రభువే మనకు జీవం. ఆ జీవం లోకానికి వెలుగు - 1,4. క్రీస్తుజయంతి పూజలో వచ్చే ఓ ప్రార్థనలో "దైవవార్త మనుష్యావతారం చేకొనడంద్వారా దేవుని వెలుగు మన మనోనేత్రాలమీద కాంతిమంతంగా ప్రకాశిచింది" అని చెప్తాం. ఈ వాక్యాలన్నింటి భావం నరావతారమెత్తిన క్రీస్తు ఓ వెలుగు లాంటివాడనే,

బేల్లెహేము గుహలో, పసులగాటిలో కన్యమాతచెంత పరుండివున్న ఆ శిశువును మనసార ధ్యానించుకొందాం. అతడు అందరు మనుష్య శిశువుల్లాగే వున్నాడు. కాని నుసిమాటున నిప్పకణాల్లాగ ఆ శిశువు మనుష్యత్వం మాటున దివ్యత్వం దాగివుంది. అతడు మనుష్యుడై కూడ దేవుడు. దేవుడైకూడ మనుష్యుడుగా జన్మించినవాడు.

3. మన రక్షణం మనుష్యావతారం నుండే ప్రారంభమవుతుంది

మనం మామూలుగా క్రీస్తు సిలువమరణం ద్వారా మనలను రక్షించాడు అనుకొంటాం. ఇది పొరపాటు. అతని మనుష్యావతారంనుండే మన రక్షణం ప్రారంభమైంది. ఈ యంశాన్ని గ్రహించాలంటే “ఇద్దరు ఆదాములు” “బృందనాయకుడు" అనే భావాలను చక్కగా అర్థం చేసికోవాలి.