పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదట ఇద్దరు ఆదాములు అనే భావం చూద్దాం. తొలి ఆదాము ఉన్నాడు. అతడు నరులమైన మనకందరికీ ప్రతినిధి. మనలందరినీ తనలో ఇముచ్చుకొన్నవాడు. ఆది 1, 27-28. ఇతని పాపమే మనకందరికీ సంక్రమించింది. కాని ఈ యాదాము రాబోయే రెండో ఆదామైన క్రీస్తుకి గుర్తుగా వుంటాడు - రోమా 5,14. క్రీస్తు ఆదామని గాదు, ఆదామే క్రీస్తుని సూచిస్తాడు.

ఆదామువల్ల మనకు కలిగిన నష్టం క్రీస్తువల్ల కలిగిన లాభం ద్వారా తీరిపోయింది. ఒక మానవుని అవిధేయత వల్ల అనేకులు నీతిమంతులయ్యారు - రోమా 5,18–21. ఆదామునందు అందరూ మృతిచెందినట్లే క్రీస్తునందు అందరూ బ్రతికారు- 1కొ15,22-23. అసలు ఆదాముద్వారా మనం పోగొట్టుకొన్న దానికంటె క్రీస్తుద్వారా మనం సంపాదించుకొందే యొక్కువ.

ఇక బృందనాయకుడు అన్నభావం చూద్దాం. యూదులసంప్రదాయం ప్రకారం సమాజంలో ఓ బృందమూ, ఆ బృందానికి ఓ నాయకుడూ వుంటాడు. ఈ నాయకుడు ఆ బృందానికి ప్రతినిధి. అతడు ఆ బృందాన్ని ఒక్కటిగా బంధించి వుంచుతాడు. ఆ బృందాన్నంతటినీ తనలో ఇముడ్చుకొని వుంటాడు. దానిమీద గాఢమైన ప్రభావం చూపిస్తాడు. ఇతనివల్ల ఆ బృందం మంచికీగానీ చెడ్డకుగాని మారుతుంది.

నరజాతికి ఆదామే మొదటి బృందనాయకుడు. అతని పాపప్రభావంవల్ల నరజాతి నాశమైంది - రోమా 5,12. ఈలాగే యెషయా తన ప్రవచనం 58వ అధ్యాయంలో వర్ణించిన బాధామయ సేవకుడు కూడ బృందనాయకుడు. ఇతనివల్ల నరులకు విమోచనం కలిగింది. ఇంకా, దానియేలు ప్రవచనం.7,13-14 వర్ణించే "మనుష్య కుమారుని పోలిన నరుడు?? కూడ బృందనాయకుడే నరులంతా ఇతనిలో ఇమిడే వున్నారు.

కాని క్రీస్తు అందరికంటెగూడ గొప్ప బృందనాయకుడు. ఆదాములాగే క్రీస్తు నరులందరినీ తనలో ఇముడ్చుకొన్నాడు. నరులందరికీ ప్రతినిధి, క్రీస్తు మన నరజాతిలో పుట్టినప్పడే నరులమైన మనమందరమూ అతనిలో ఇమిడి పోయాం. అందుచేత నరావతారం నుండి మన రక్షణ ప్రారంభమైనదని చెప్పాలి.

వాక్కు నరుడై జన్మించినపుడు ఓ ప్రత్యేక మానుష దేహాన్ని మాత్రమే స్వీకరించలేదు. అతడు మన మానుషత్వాన్నంతటినీ, అనగా మన మానవ స్వభావాన్నంతటినీ స్వీకరించాడు. మానవులమైన మనమందరమూ అతనిలో ఇమిడిపోయాం. కనుక అతడు తన మనుష్యావతారం ద్వారా నరులందరినీ రక్షించడానికి పూనుకొన్నాడు. ఈలా మన రక్షణం సిలువతోగాక, మనుష్యావతారంతో ప్రారంభమైంది.

4.