పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజల యెదుట నన్ను నిరాకరించేవాణ్ణి పరలోకం లోని నా తండ్రి యెదుట నేను నిరాకరిస్తానని క్రీస్తు రూఢిగా చెప్పాడు - 10,32-33. ఐనా ప్రభువు పేత్రు నిజాయితీని మెచ్చుకొని కరుణతో అతని తప్పిదాన్ని మన్నించాడు.

ఈ సందర్భంలో మత్తయి సువిశేషంలో లేని చిన్నవాక్యమొకటి లూకా సువిశేషంలో కన్పిస్తుంది. "ప్రభువు ప్రక్కకు తిరిగి పేత్రుని చూచాడు" -లూకా 22,61. ఇది ఎంత చిన్న వాక్యమో అంత తీక్షణమైనది. పేత్రు క్రీస్తు ఒకే తావులో అనగా ప్రధానార్చకుని ముంగిటలో వున్నారు. పేత్రు తన్నెరుగనని ముమ్మారు బొంకుతూండగా క్రీస్తు విన్నాడు, అతడు కరుణతో పేత్రు వైపు తేరిపారజూచాడు. ఆ చూపు బాణంలాగ పేత్రుగుండెల్లో గ్రుచ్చుకొని అతనికి పశ్చాత్తాపం పట్టించింది. అతనిలో ఆరిపోయిన ప్రేమ జ్యోతిని మల్లా వెలిగించింది. పేత్రు ఇక అక్కడ నిలువలేక పోయాడు. వెలుపలికి వెళ్లి బోరున ఏడ్చాడు. నేడు మనం తప్ప చేసినపుడు ప్రభువు మనలను కూడ ఈలాగే హెచ్చరిస్తూంటాడు. తన వరప్రసాదంతో మన హృదయాన్ని ప్రేరేపించి పశ్చాత్తాపాన్ని వెలికి తీస్తూంటాడు.

పేత్రు దౌర్బల్యాన్ని చూచి తిరుసభ అధికారులు పాఠం నేర్చుకోవాలి. మన పదవులూ అధికారాలూ మనలను పాపం నుండి కాపాడలేవని గుర్తించాలి. ఒక్కతిరుసభ అధికారులే గాక క్రైస్తవులందరూ పేత్రుని జూచి వివేకం తెచ్చుకోవాలి. మనం మనమనుకొన్న దానికంటె దుర్భలులం. కొద్దిపాటి ప్రలోభాలకే కూలిపోతాం.

పేత్రు న్యాయసభ యెదుట క్రీస్తులా ధైర్యంగా నిలువలేకపోవచ్చు. నిజమే, కాని అతడు యూదాలాగ నిరాశ చెంది ఆత్మహత్యకు పూనుకోలేదు. కనుక అతడు యోగ్యుడైన శిష్యుడే చిత్తశుద్ధితో కూడిన అతని పశ్చాత్తాపం నేడు మన పశ్చాత్తాపానికి ఆదర్శంగా వుంటుంది.

3. న్యాయసభ తీర్పు - 27,1-2

గురువారం రాత్రి న్యాయసభ క్రీస్తుపై విచారణం ప్రారంభించింది. ఆ విచారణం అడపాదడపా రాత్రంతా కొనసాగింది. శుక్రవారం వేకువనే న్యాయసభ సభ్యులందరూ ఏకమై క్రీస్తుని చంపించాలని అధికారపూర్వకంగా నిర్ణయించారు. కనుక అతన్ని బంధించి పిలాతుకు అప్పగించారు.

యూదుల న్యాయసభకు ముద్దాయికి మరణశిక్ష విధించే అధికారం లేదు. మరణశిక్షను విధించేదీ దాన్ని అమలు చేయించేదీ కూడ రాష్ట్రపాలకుడైన పిలాతే. కనుకనే ప్రధాన యాజకులు క్రీస్తుని అతని కప్పగించారు.