పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలిలయులను తమ ప్రార్థనా మందిరాల్లో వేదగ్రంథాన్ని చదవనిచ్చేవాళ్లు కాదు. పేత్రు ఇరకాటంలో పడ్డాడు. ఆ గుంప నుండి తన్నుతాను రక్షించుకోవడానికి నేను ఆ మనుష్యుని ఎరుగనే ఎరుగనని పెద్దగా నొక్కిచెప్పాడు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఒట్ట వేసికొన్నాడు. శపించడానికి కూడ పూనుకొన్నాడు. ఎవరిని? పేత్రు తన్ను తానైనా శపించుకొని ఉండవచ్చు లేదా క్రీస్తునైనా శపించి వుండవచ్చు. ఈలా మూడవసారి బొంకాడు. అతడు మొదటిసారి చాలమంది ముందు పెద్దగా బొంకి వొట్టవేసికొన్నాడు. రెండవసారి బొంకాడు. మూడవసారి పెద్దగుంపు ముందు బిగ్గరగా బొంకాడు. ఆవేశంతో ఒట్ట వేసికొని శాపనార్ధాలకు దిగాడు. ఈ విధంగా అతని పాపం మెట్టుమెట్టకూ పెరిగిపోతూ వచ్చింది.

పేత్రు మూడవసారి బొంకుతుండగానే కోడికూసింది. వెంటనే క్రీస్తు పలుకులు గుర్తుకి వచ్చాయి. కోడి కూయకముందే నీవు నన్నెరగనని మూడుసార్లు బొంకుతావని ప్రభువు అతన్ని పూర్వమే హెచ్చరించాడు - 26,34. ఆ హెచ్చరిక కోడికూతకంటె గూడ పెద్దగా అతని చెవుల్లో ప్రతిధ్వనించింది.

పేత్రుకి తానెంత దుర్బలుడో అర్థమైంది. తన పాపమెంత ఫనోరమైందో తెలిసింది. ఇక అక్కడ వుండలేక పోయాడు. కయిఫా యింటి ద్వారాన్ని దాటి, శత్రువుల మధ్యనుండి తప్పించుకొని, వెలుపలికి వచ్చాడు. గురువుకి ఎంత ద్రోహం చేసాను అనుకొని పట్టెడు దుఃఖంతో వెక్కివెక్కి యేడ్చాడు.

ఇక్కడ ఇంకో విషయం గూడ చెప్పాలి. యూదాలోకి ప్రవేశించి అతన్ని వశం జేసికొన్న పిశాచం పేత్రునీ మిగిలిన అపోస్తలులను గూడ స్వాధీనం చేసికోవాలని కోరుకొంది. అది వాళ్ళను గోదుమలను జల్లించినట్లుగా జల్లించాలని - అనగా బలంగా శోధించాలని ఆశించింది. పేత్రుని తీవ్రంగా శోధించి అతని విశ్వాసాన్ని నాశం జేయాలనుకొంది. ఐనా ప్రభువు ముందుగానే పేత్ర కొరకు ప్రార్థన చేసాడు. ఆ ప్రార్థనా బలం వల్లనే పేత్రు పడిపోయి కూడ మల్లా లేచాడు. క్రీస్తుని ఎరగనని బొంకికూడ మల్లా పశ్చాత్తాపపడ్డాడు. అలా పరివర్తనం చెందిన పేత్రు ఇతరులకు కూడ పశ్చాత్తాపం కలిగిస్తాడు. పూర్వం క్రీస్తుని విడచి పారిపోయినవాళ్లను మల్లా ప్రభువు దగ్గరికి తీసికొనివస్తాడు. వాళ్లను బలపరుస్తాడు. అతడు యెరూషలేములోని శిష్యులందరికీ నాయకుడౌతాడు - లూకా 22, 31-32.

సువిశేష రచయితలు ఎంతో నిజాయితీ కలవాళ్లు, వాళ్లు పేత్రు దౌర్బల్యాన్ని కప్పిపెట్టలేదు. అతని తప్పని ఉన్నదాన్ని ఉన్నట్లుగా వర్ణించారు.