పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు మనకు స్నేహితుడు కావడం మన భాగ్యవిశేషం. అతన్ని మామూలు మిత్రులలాగ కంటితో చూడలేం. చేతితో తాకలేం. ఐనా అతడు మనకు నిజంగానే మిత్రుడు. మామూలు నరుల స్నేహంకంటె క్రీస్తు స్నేహం మనకు ఎక్కువ లాభదాయకం. ఎందుకంటే అతడు దేవుడు. సర్వశక్తి సంపన్నుడు. మనమంటే యిష్టపడేవాడు. మనకు సహాయం జేయగోరేవాడు. మామూలు నరుల చెలిమికి ఈ లక్షణాలన్నీ వుంటాయా? కనుక క్రీస్తుని స్నేహితునిగా బడసిన నరుడు ధన్యుడు.

పౌలుభక్తుని గొప్ప క్రీస్తు తనకూ, తాను క్రీస్తుకీ స్నేహితులు కావడంలోనే ఉంది. ఈ స్నేహభావాన్ని మనసులో పెట్టుకొనే అతడు "నాకు జీవించడమంటే క్రీస్తుని జీవించడమే అని వ్రాసికొన్నాడు. ఫిలి 1,21. అతడు క్రీస్తుని నమ్మినవాడు. నిరంతరం ఆ ప్రభువుని గూర్చి తలంచుకొన్నవాడు. ఎల్లవేళల అతన్నిస్తుతించి కీర్తించినవాడు. తన అవసరాల్లో అతన్ని ఆశ్రయించినవాడు. అతన్ని బోధించడానికి సేవలు చేయడానికే నిరంతరం శ్రమించినవాడు. అతని ప్రేమను పొందానని నమ్మినవాడు. కనుకనే "క్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణత్యాగం చేసికొన్నాడు" అని వ్రాసికొన్నాడు - గల 2,20. అతడు ప్రభువుని ఎంతగా నమ్మాడు అంటే "నన్ను బలపరచే ఆ ప్రభువుద్వార, నేను ఏ పనినైనా చేయగలను" అని చెప్పకొన్నాడు – ఫిలి 4,13. క్రీస్తుతో ఏలా చెలిమి చేయాలి అనే ప్రశ్న వచ్చినపుడు ఈ పౌలు మనకు ఆదర్శంగా ఉంటాడు.

శిష్యులమైన మనం నేడు క్రీస్తుతో స్నేహాన్ని పెంపొందించుకోవడానికి మార్గాలు నాల్లున్నాయి.

1. మొదటిది, క్రీస్తుకి నేస్తులంగావాలనే కోరిక మన హృదయం బలంగా ఉండాలి. మనకు నరుల స్నేహం చాలదు. దేవుని స్నేహంకూడ అవసరం. మన విలువలన్నిట్లో పైవిలువ క్రీస్తే అతనికొరకే మనం జీవించేది. అతని స్నేహాన్ని పొందకపోతే ఇక మన జీవితానికి సార్ధక్యమేమిటి?

2. మన హృదయంలోని స్నేహవాంఛను గుర్తించి ఆ ప్రభువు తన్నుతాను మనకు మిత్రునిగా సమర్పించుకొంటాడు. మనం కృతజ్ఞతా భావంతో ఆ దివ్య మిత్రుణ్ణి అంగీకరించాలి. అతన్ని చెలికాడ్డిగా పొందడం మహాభాగ్యం అనుకోవాలి. పూర్వం ఆ ప్రభువు ధనిక యువకుని వంక ప్రేమతో చూచాడు - మార్కు 10,21. లాజరుని గాఢంగా ప్రేమించాడు - యోహా 11,36. మగ్డలీనను మరియా అని ఆప్యాయంగా పేరెత్తి పిలిచాడు - 20,16. యోహానుని ప్రత్యేకంగా ప్రేమించాడు - 13,23. మార్త ఆతిథాన్ని స్వీకరించాడు - లూకా 10,40. ఆలాంటి ప్రభువు నేడు మనలను గూడ ప్రేమించి మనకు స్నేహితుడు కాబోతున్నాడు. కనుక మనం ఆ ప్రభువుని బంగారాన్ని లాగ స్వీకరించాలి. ఈ లోకమిత్రులు ఎందరున్నా వాళ్ళు అతనితో సాటిగారు.