పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్కించుకోగోరుతారు. కొందరు పేరు తెచ్చుకోవాలని తాపత్రయ పడతారు. ఇవన్నీ లోకంయెదుట మనలను గొప్పవాళ్ళను చేస్తాయని బ్రాంతి పడతారు. కాని మనకు స్వయంగాలేని విలువ లోకవస్తువులవల్ల రాదు.

ఈ సందర్భంలోగూడ మన గురువైన క్రీస్తు మనలను దారికి తీసికొని వస్తాడు. మనం లోక వస్తువులను అంటిపెట్టుకొని ఉండకుండ పేదజీవితం గడపాలని బోధిస్తాడు. నరుని హృదయానికి పూర్ణతృప్తినిచ్చేది వస్తువులు కాదు, వాటిని సృష్టించిన భగవంతుడు ఒక్కడేనని విదశం చేస్తాడు. మనం లోకవస్తువులను పూర్తిగా త్యజించనక్కరలేదనీ, వాటిల్లోకూడ దేవుణ్ణి దర్శించి వాటిని మన అవసరాలకు వాడుకోవచ్చుననీ తెలియజేస్తాడు. ప్రకృతిలో భగవంతుని సాన్నిధ్యాన్ని దర్శింపమని చెప్పాడు. ఈ లోకాన్ని వదలివేయనక్కరలేదనీ, లోకంలో వున్నాలోకానికి చెందకుండా జీవిస్తే చాలుననీ నేర్పుతాడు.

మన వుపాధ్యాయుడైన క్రీస్తు మనలను ఈలా నిరంతరం చక్కదిద్దుతుంటాడు. మనం అవివేకంవల్ల అపమార్గం పట్టినా అతని సవరింపులవల్ల మళ్ళా మంచి త్రోవలో అడుగిడతాం. మనతరపున మనం ఆ ఉపాధ్యాయునికి మంచి శిష్యులంగా మెలిగితే చాలు, అతడు మనలను సంస్కరించి పునీతులను చేస్తాడు.

4. క్రీస్తుతో స్నేహం

ప్రభువు మనకు గురువు, అనుకరణీయుడు. అంతేగాదు. అతడు ఎప్పడుగూడ తిరుసభలో సజీవుడై యుండి మనకు తోడుగాను స్నేహితుడుగాను మెలుగుతుంటాడు. క్రీస్తుకి శిష్యుడైనవాడు అతనికి స్నేహితుడుకూడ ఔతాడు. నూత్నవేదం క్రీస్తు స్నేహాన్ని చాలసార్లు ప్రస్తావిస్తుంది.

ఉత్తాన క్రీస్తు లోకాంతంవరకు నేను సర్వదా మీతో ఉంటానని అభయమిచ్చాడు - మత్త 28,20. అతడు మనతో వుంటాడు అంటే, మనకు స్నేహితుడుగాను సహాయం చేసే వాడుగాను వుంటాడని భావం. ఇంకా ప్రభువు శిష్యులతో ఈలా చెప్పాడు. "నన్ను ప్రేమించేవాడు నా మాటను పాటిస్తాడు. అపుడు నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు. మేము అతనివద్దకు వచ్చి అతనితో వసిస్తాం" - యోహా 14,23. ప్రభువు మనకు నేస్తుడుగానే మనతో వసిస్తూంటాడు. మరోమారు అతడు శిష్యులతో "ఇకమీదట నేను మిమ్మ దాసులని పిలువను, స్నేహితులని పిలుస్తాను" అన్నాడు - 15,15. కడన దర్శన గ్రంథం 3,20లో ప్రభువు ఈలా నుడివాడు. “విను, నేను ద్వారంవద్ద నిలచి తలుపు తడతాను. ఎవడైనా నా స్వరం విని తలుపుతీస్తే నేను లోనికి వస్తాను. నేను అతనితోను అతడు నాతోను భుజిస్తాం". ఈ వేద వాక్యాలన్నీ క్రీసూ మనమూ స్నేహితులమనే నొక్కి చెప్తాయి.