పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. క్రీస్తుకి స్నేహితులైనవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు స్నేహితులుగా మెలాగాలి. తొలినాటి యెరూషలేము క్రైస్తవులు ప్రభువుని నమ్మిన శిష్యులు. అతనికి స్నేహితులు. ఈ స్నేహితులంతా తమలోతాము మిత్రులుగా ఉండేవాళ్ళ క్రీస్తుని విశ్వసించిన వాళ్ళంతా కలసి సమష్టిగా జీవించారు. తమకున్నదాన్ని అందరితో పంచుకొన్నారు - అ.చ. 2,44. విశ్వాసులు ఏక మనస్సుతో, ఏక హృదయంతో జీవించారు. తమకున్న ఆస్తిపాస్తులను ఇవి మా సొంతం అనుకోకుండా అందరితో పంచుకొన్నారు - 4,32. ఈ తొలినాటి విశ్వాసులు మనకు ఆదర్శం. కనుక మనం క్రీస్తుకి మిత్రులైన తోడి క్రైస్తవులతో కలసిమెలసి జీవించాలి. ఇచ్చిపుచ్చుకొంటుండాలి. ఇతరులకు సాయం చేస్తుండాలి. ఇతరులనుండి సాయం పొందుతూండాలి.

4. విశ్వాసులుకాని అన్యులనుకూడ క్రీస్తుకి మిత్రులనుగా చేయాలి. చాలమందిని క్రీస్తు దగ్గరికి రాబట్టాలి. వాళ్ళు అతన్ని అంగీకరించి పూజించి ప్రేమించేలా చేయాలి. పౌలు భక్తుడు ఈలా చేసాడు. అతడు కొరింతు పౌరులను నిష్కలంకమైన కన్యనుగా క్రీస్తుకి ప్రధానం చేయగోరాడు - 2 కొరి 11,2. అనగా వారిని క్రీస్తు శిష్యులనుగా భక్తులనుగా తయారుచేయగోరాడు. ఈలాగే మనంకూడ మన ప్రేషిత సేవద్వారా చాలమందిని క్రీస్తుకి శిష్యులనుగా మిత్రులనుగా తయారుచేయాలి. వేదబోధలో ఉత్సాహం చూపాలి. దైవరాజ్య వ్యాప్తి మనపని అనుకోవాలి.

స్నాపక యోహానుకూడ తన్ను పెండ్లికుమారుని మిత్రునితో పోల్చుకొన్నాడు. యూదుల సంప్రదాయం ప్రకారం వధూవరులను కలిపేవాడు పెండ్లికుమారుని మిత్రుడు. వాళ్ళిద్దరికీ పరిణయమయ్యాక తాను వైదొలగుతాడు. యోహాను క్రీస్తు రాకడకు ప్రజలను సిద్ధంజేసాడు. వాళ్ళ తమ పాపాలకు పశ్చాత్తాపపడి మెస్సీయాను అంగీకరించాలని బోధించాడు. క్రీస్తు వచ్చాక ఇతడే లోకం పాపాలను పరిహరించే గొర్రెపిల్ల, మీరు ఇతన్ని అనుసరించండి అని పల్కి అతన్ని ప్రజలకు పరిచయంజేసాడు. ఆ పిమ్మట అతడు హెచ్చాలి నేను తగ్గాలి అని చెప్పి తాను ప్రక్కకు తొలగాడు - యోహా 3,29-30. ఈ యోహానులాగే మనంకూడ తోడివారిని క్రీస్తుని అంగీకరించడానికి సిద్ధం చేయాలి. వారి హృదయాల్లో క్రీస్తుపట్ల భక్తి విశ్వాసాలు పుట్టించాలి. వాళ్ళు క్రీస్తుని ఎన్నుకొన్నాక మనం వినయంతో ప్రక్కకు తొలగాలి. ఈ విధంగా అన్యులను క్రీస్తు దగ్గరికి రాబట్టడంలో పౌలూ స్నాపక యోహానూ మనకు ఆదర్శంగా ఉంటారు. మనమూ క్రీస్తుకి స్నేహితులంగా మెలగాలి. ఇతరులూ అతనికి స్నేహితులయ్యేలా చూడాలి.

ఈ పొత్తంలో శిష్యధర్మాలను నాల్డింటిని ఉదాహరించాం. శిష్యుడు క్రీస్తు జీవిత విధానాన్ని అనుసరిస్తాడు. అతని బోధలను పాటిస్తాడు. తాను అపమార్గం పట్టినపుడు • ప్రభువు అతన్ని చక్కదిద్దుతాడు. అతడు క్రీస్తుకి మిత్రుడుగా మెలుగుతాడు. ఈ భాగ్యాలన్నీ మనకుకూడ సిద్ధించాలని ప్రభువుని వేడుకొందాం.