పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. ఈ సామెత మత్తయి గ్రంథంలో క్రీస్తు తుది సందేశం. దీని తర్వాత క్రీస్తు ఇక మాట్లాడడు. అతని శ్రమల ఘట్టం వస్తుంది. క్రీస్తు అంతిమ సందేశాన్ని అతని శిష్యులమైన మనం పాటించకపోతే ఎలా?

2. లూకా ఉపమానాలు

17. మేల్కొనివుండే సేవకులు - లూకా 12, 35-30

1. రాత్రి ఆలస్యంగా తిరిగివచ్చే యజమానుని కొరకు వేచివుండే సేవకులను ఆ యజమానుడు బహూకరించాడు. అలాగే ప్రభువు రెండవరాకడకు విశ్వాసంతో వేచివుండే శిష్యులను క్రీస్తు బహూకరిస్తాడు.

2. వేచి వుండాలంటే విసుగు పడుతుంది. కాని మనకిష్టమైనవారి కొరకు వేచివుండటం సంతోషాన్నే కలిగిస్తుంది. క్రైస్తవ జీవితమంతా యజమానుడైన క్రీస్తు కొరకు కాచుకొని వుండడమే. మన ఆశలూ, కోరికలూ అన్నీ తీర్చేది అతడే.

3. గొప్పవాళ్ళ కొరకు వేచివుండేవాళ్ళ అన్ని విధాల తయారై గూడ వుంటారు. మనం ప్రభువు రెండవ రాకడకు వేచివుండే సేవకులం. మన తరఫున మనం ప్రార్థనతో తయారై యుండాలి.

4. యజమానుడు సేవకుల విశ్వాసాన్ని మెచ్చుకొని తినేవారికి భోజనం వడ్డించాడు. అనగా వారిని యజమానులను చేసి తాను సేవకుడయ్యాడు. ఇలా ప్రభువు మన సేవలను బహూకరిస్తాడు. పైగా ఇక్కడ "భోజనం వడ్డించడం" అంటే పరలోక విందులో పాల్గొనేలా చేయడం, మన సేవలకు మోక్ష బహుమానం లభిస్తుందని భావం.

5. క్రీస్తు శిష్యులను సేవకులు అని కాక స్నేహితులు అని పిల్చాడు. యోహా 15.15. దైవసేవ వలన మనకు అపారమైన విలువ వస్తుంది.

18. అధికారం గల సేవకుడు - లూకా 12,41–46

1. యజమానుడు ఇంట లేనపుడు తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన దాసుని యజమానుడు బహూకరిస్తాడు. అలా చేయనివాడ్డి శిక్షిస్తాడు. అలాగే క్రైస్తవ సమాజంలోని అధికారులు తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తే క్రీస్తు వారిని బహూకరిస్తాడు. లేకపోతే శిక్ష పడుతుంది.

2. ఈ కథలోని యజమానుడు కొంతకాలం కనుమరుగయ్యాడు. ఉత్తానక్రీస్తు మనతో వుంటాడు. ఐనా మన కంటికి కన్పించడు. అతడు మనకు కనుమరుగైనట్లే గదా! కనుకనే చాలామంది క్రైస్తవులకు అతని పట్ల భక్తివిశ్వాసాలు వుండవు. కాని చూడక విశ్వసించేవాళ్ళు ధన్యులు - యోహా 20,29.