పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాటిని అవతల పారవేస్తారు. ఈలా ఈ సామెతలో మంచి చేపలకీ పాడు చేపలకీ వేర్పాటు జరిగింది. ఓ రైతు పొలంలో గోదుమలు చల్లగా అతని శత్రువులు వచ్చి కలుపు గింజలు కూడా చల్లిపోయారు. కనుక రెండూ మొలచి ఎదిగాయి. మొదట ఈ రెండు పైర్లు ఒకటి గానే కన్పిస్తాయి. క్రమేణ కలుపును గుర్తించవచ్చు. అలా గుర్తు పట్టగానే సేవకులు దాన్ని పెరికివేద్దామనుకొన్నారు. కాని యజమానుడు వారించాడు. అప్పటికే దాని వ్రేళ్లు గోదుమ వ్రేళ్లతో పెనవేసికొని ఉంటాయి. దాన్ని పీకితే గోదుమ కూడ లేచి వస్తుంది. కనుక పంట పండిందాకా కలుపును సహించి ఊరుకోవలసిందే. తర్వాత కోత కోసేపుడు మొదట గోదుమ వెన్నులను so. కట్టలు కడతారు. అటుపిమ్మట కలుపును కోసి పొయ్యిలోకి వంటచెరకుగా వాడుకొంటారు. ఈ విధంగా ఈ సామెతలో ఈ రెండు పైర్లను వేరుచేయడం జరిగింది.

3. భావం

ఈ రెండు సామెతల్లోను ప్రధానమైన విషయం వేరుపాటు అని చెప్పాం. మంచి చేపల నుండి చెడ్డవాటినీ, మంచి పైరునుండి చెడ్డపైరునీ వేరుచేస్తారు. అలాగే న్యాయనిర్ణయ కాలంలో గూడ జరుగుతుంది. ప్రభువు మంచివాళ్ళ నుండి చెడ్డవాళ్ళను వేరుజేస్తాడు. పాపాత్ములకు శిక్షా, పుణ్యాత్ములకు సంభావనా లభిస్తుంది.

4. అన్వయం

ప్రజల మంచిచెడ్డలను ఎంచేవాడు దేవుడు, మనం కాదు. కాని ఆ ప్రభువు కూడ చివరి గడియ దాకా ప్రజలను ఓర్పుతో క్షమిస్తాడు. అతడు వెర్రి అంజూరానికి గూడ ఒక యేడు గడువిచ్చిన వాడు — లూకా 13,8. అందుచేత మనం పాపాత్ములను జూచి సహనం కోల్పోగూడదు. వాళ్ళకు శిక్ష రావాలని అసలే కోరుకోగూడదు. వాళ్లు పరివర్తనం చెందాలని ఆశించాలి. వాళ్ళపట్ల ఓర్పు చూపాలి. పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు దుష్టుడున్నాగానీ ప్రభువు సహించి ఊరుకోలేదా?

9. ఉపమాన వాక్యం

ఈ వర్గం సామెతల్లో ఒక ఉపమాన వాక్యం గూడ ఉంది. అది శవం ఉన్నకాడ రాబందులు చేరతాయి అనే వాక్యం - మత్త 17,37. ఇక్కడ శవం అంటే మెస్సీయా,రాబందులు అంటే శిష్యకోటి. కడపటి రోజుల్లో దేవునిపట్ల విశ్వాసయోగ్యంగాప్రవర్తించేవాళ్లు కొద్దిమంది, వీళ్ళకే పూర్వవేదంలో "శేషప్రజలు" అని పేరు. శేషప్రజలుమెస్సియా చుటూ ప్రోగై అతని బోధలు ఆలిస్తారు. ఇక్కడ రాబందులు అంటే ఈ శేషప్రజలే.