పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. అన్వయం

విజయనగర సామ్రాజ్యం, రోమను సామ్రాజ్యం మొదలైన ప్రపంచ సామ్రాజ్యాలన్నీ బాగా విస్తరిల్లి ఉన్నతస్థాయికి వచ్చి తర్వాత పతనమై పోయాయి. ఈలా ప్రపంచంలో కొన్ని కోట్ల సామ్రాజ్యాలు పట్టాయి, పెరిగాయి, పడిపోయాయి. కాని క్రీస్తు సామ్రాజ్యం ఈలా పడిపోదు. క్రైస్తవుల్లో ఎన్ని లోపాలున్నా ఎన్ని అవకతవకలున్నా ఆ ప్రభువు రాజ్యమేమో పెరుగుతూనే ఉంటుంది. అతని శక్తి ఆ దైవరాజ్యంలో పని చేస్తూంటుంది. మన క్రైస్తవ సమాజమే ఈ దైవరాజ్యం.

3. విత్తేవాడు - మత్త 13, 4-9

1. వివరణం

పాలస్తీనా దేశంలో నవంబరు డిసెంబరు నెలల్లో విత్తనాలు విత్తుతారు. మనలాగా గొర్తితో వెదవేయరు. సేద్యగాళ్ళ మొదట దున్నని నేలమిద చేతోనే విత్తనాలు వెదజల్లుతారు. అటుతరువాత ఆ విత్తనాల విూద భూమిని దున్నుతారు. ఏ విత్తనాల విూదనైనా మన్ను పడకపోతే వాటిని పక్షులు తినివేస్తాయి. అలాగే రాతినేలలో గాని ముండ్ల తుప్పలు ఎదిగివున్న నేలలోగాని పడిన విత్తనాలు అట్టే పంటకు రావు. కాని మెత్తని నేలలో పడిన విత్తనాలు మాత్రం సమృద్ధిగా ఫలిస్తాయి. ఈ సామెతలో మొదట విత్తనాలను మొలిపించడం లోను పైరును ఎదిగించడం లోను ఉండే బాధా అనగా నిస్సారమైననేల, విత్తనాలను తినివేసే పక్షులూ, సూర్య తాపమూ, ముళ్ళ పొదలూ మొదలైనవీ అటుపిమ్మట పంట చేతికి వచ్చినపుడు కలిగే సంతోషమూ - ఈ రెండు దశలకు తేడా చెప్పబడింది. క్రీస్తు బోధలు ప్రారంభించిన మొదటి రోజుల్లో చాల కష్టాలు ఎదురయ్యాయి. కొందరు శ్రోతలు అతనిని వ్యతిరేకించారు. కొందరు శిష్యులు కూడ అతన్ని విడనాడి వెళ్ళిపోయారు. ఈలాంటి కష్టపు పరిస్థితుల్లో అతని బోధ కొనసాగింది. ఐనా ఈ బోధల ద్వారానే ప్రభు సామ్రాజ్యం విస్తరిల్లుతుంది. పొలంలోని అవరోధాలనెదుర్కొని పంట చేతికి వచ్చినట్లే ప్రారంభంలోని ఆటంకాల నెదుర్కొని దైవసామ్రాజ్యం వ్యాప్తిలోకి వస్తుంది - ఇది ఈ ఉపమానం భావం. ఇక్కడ పొలంలో పండిన పంటకూ వ్యాప్తిలోకి వచ్చిన దైవరాజ్యానికి పోలిక చెప్పబడింది. కష్టాలతో ప్రారంభమైన ఈ రాజ్యం చివరికి ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది - ఇది నీతి.

మత్తయి 18, 18-23లో ప్రస్తుత సామెతకు వివరణం చెప్పబడివుంది. క్రీస్తు మొదట ఈ సామెత చెప్పినపుడు పొలంలో పండిన పంట దీనిలో ప్రధానాంశం. కాని రానురాను తొలినాటి క్రైస్తవ సమాజంలో ఈ సామెత భావం మారిపోయింది. ఈ పొలం నరుల హృదయమూ, ఈ విత్తనాలు క్రీస్తు బోధలూ అనే భావం ప్రచారంలోకి వచ్చింది. క్రొత్తగా క్రైస్తవ మతంలో చేరినవాళ్ళు క్రీస్తు బోధలను ఎంత చిత్తశుద్ధితో పాటిస్తున్నారో తమ హృదయాలనే పరీక్షించి చూచుకోవాలి అనే అంశం వ్యాప్తిలోకి వచ్చింది.