పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. అవగింజ - మత్త 13,31-32

1. వివరణం

ఈ సామెత దైవరాజ్య విస్తరణాన్ని గూర్చి చెప్తుంది. పూర్వవేదం బాబిలోను లాంటి గొప్ప సామ్రాజ్యాలను కొమ్మలు చాచి పక్షులకు ఆశ్రయమిచ్చే మహావృక్షాలతో పోలుస్తుంది - దాని 4,12. ప్రస్తుత సామెతలో కూడ ఈ భావం ఇమిడి ఉంది. ఆవగింజ మర్రివిత్తనం లాగ చాల చిన్నది. ఐనా ఆ విత్తనంలో నుండి పెద్ద చెట్టు ఎదిగి వస్తుంది. పాలస్తీనా దేశంలో ఆవచెట్టు పదడుగుల వరకూ పెరుగుతుంది. దానిమిూద పక్షులు వ్రాలడం కూడ కద్దు. అంత చిన్న బీజం నుండి అంత పెద్ద చెట్టు పెరుగుతుంది. అలాగే దైవరాజ్యం కూడ మొదట అల్ప సంఖ్యాకులతో ప్రారంభమై కడన మహాసమాజంగా విస్తరిల్లుతుంది. ఇపుడు గ్రామగ్రామాల్లో సంచారం చేసే క్రీస్తు పండ్రెండు మంది శిష్యులు మాత్రమే దైవరాజ్యం, కాని ఇకమిూదట అపార సంఖ్యాకులు ఈ రాజ్యంలో చేరతారు. మొదట కొంచెము, కడపట ఘనము - ఇది యీ సామెత భావం.

2. అన్వయం

దైవరాజ్యమనేది ఎక్కడో గాదు మన హృదయంలోనే ఉంటుంది. కనుకనే ప్రభువు దైవరాజ్యం విూలోనే ఉంది అని బోధించాడు - లూకా 17,21. ఎవరి హృదయం పవిత్రంగా ఉంటుందో వాళ్ళల్లో దైవరాజ్యం నెలకొని ఉంటుంది. అందుచేత క్రైస్తవులు చేయవలసిన మొదటి పని హృదయాన్ని శుద్ధిచేసికోవడం.

2. పులిసిన పిండి - మత్త 13, 33

1. వివరణం

పై సామెత లాగే యిదికూడ దైవరాజ్య విస్తరణను గూర్చి చెప్పేదే. దానిలాగే ఇది కూడ మొదట కొంచెము - కడన గొప్ప అనే నీతినే బోధిస్తుంది. పాలస్తీనా స్త్రీలు రొట్టెల పిండిని పులియజేయడానికి పులిపిడి ద్రవ్యాన్ని వాడతారు. (మన ప్రాంతంలో మజ్జీగను పులిపిడి ద్రవ్యంగా వాడతారు.) ఈ ద్రవ్యం ఓ చిన్నముక్క ఈ చిన్న మక్కే మూడు కుంచాల పిండి పొంగి పెద్ద బానెడంత అయ్యేలా చేస్తుంది. ఈలాగే దైవరాజ్యం కూడ కొలదిపాటి సభ్యులతో ప్రారంభమై క్రమేణ ఖండఖండాంతరాల్లో వ్యాపిస్తుంది. ఈ రెండు సామెతల్లోను ప్రారంభానికీ అంతానికీ ఉండే తేడాను గుర్తించాలి. చిన్న విత్తు, పెద్ద చెట్టు. చిన్నముక్క బానెడంత పులిసిన పిండి. ఇప్పడు కొలది మంది అనామకులైన శిష్యులు, తర్వాత ఖండఖండాల్లో వ్యాపించే క్రైస్తవ సమాజం - ఇవి ఇక్కడ పోలికలు.