పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై సామెత లోని నాల్లురకాల నేలలకును నాల్లు రకాల నరులతో పోలిక చెప్పారు. విత్తనాలను అపహరించే పక్షులకు దయ్యంతో పోలిక చెప్పారు. క్రీస్తు మొదట బోధించినపుడు ఈ సామెతకు ఈ భావాలు లేనేలేవు. ఇవన్నీ తొలినాటి క్రైస్తవులు చేర్చినవి. ఈలా తొలినాటి క్రైస్తవ సమాజంలో కొన్ని సామెతల భావాలు పూర్తిగా మారిపోయాయి.

2. అన్వయం

యెషయా 55, 10-11 ప్రభు వాక్యాన్ని వానతోను మంచుతోను పోలుస్తుంది. వానా మంచూ కురిసి నేలను పదును జేసి పైరు ఎదిగిస్తాయి. సేద్యగానికి ధాన్యం చేకూర్చి పెడతాయి. అలాగే దైవవాక్కుగూడ మన హృదయమనే పొలాన్ని పదునుజేసి దానిలో మంచి కోరికలు మొలకెత్తిస్తుంది. మనం దైవ సంకల్పం ప్రకారం జీవించేలా చేస్తుంది. కురిసిన వర్షంలాగే దైవవాక్కు కూడ వ్యర్థంగాపోదు. ఈ దైవవాక్కు మన హృదయంలో గూడ వేరుబాతుకుని చక్కగా పంటపండితే ఎంత బాగుంటుంది?

4. పండిన పంట - మార్కు4, 26–29

1. వివరణం

దైవరాజ్యం ఏలా వ్యాప్తిలోకి వస్తుంది అని ప్రశ్నిస్తే ఈ సామెతలో జవాబు లభిస్తుంది. అది యెవరూ గమనించకుండానే, దైవశక్తి వలన దానంతట అదే వ్యాప్తిలోకి వస్తుంది. ఓ దినం ప్రజలంతా దిడీలున ఆ రాజ్యాన్ని గుర్తిస్తారు, అంతే. ఈ సామెతలో దైవరాజ్య వ్యాప్తి దానంతట అదే పండే పంటపొలంతో పోల్చబడింది. అసలు దీనికి “ఓర్పుతో వేచివున్న సేద్యగాడు" అని పేరు పెడితే బాగుంటుంది. సేద్యగాడు విత్తనాలు వెదజల్లాడు. అటుతరువాత అతని పనిలో అతడు నిమగ్నుడై యున్నాడు. పంట కోసం మాత్రం ఓపికతో వేచిఉన్నాడు. అలా అతడు తన పనిలో నిమగ్నుడై యుండగా అతనికి తెలియకుండానే పైరు మొలచి పెరిగి వెన్ను వేసి పంట పండుతుంది. ఆ శక్తిని పైరుకు ఎవడిచ్చాడు? భగవంతుడే. భగవంతుని కరుణ వల్లనే అది పెరిగి పంట పండుతుంది.

ఆ రోజుల్లో పాలస్తీనా దేశం రోమను ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. రోముతో యుద్ధం చేసి పాలస్తీనా దేశానికి స్వాతంత్ర్యం సంపాదించాలని కొందరు యూదులు తహతహ లాడుతూండేవాళ్ళు ఈ వర్గం వారికి ఉత్సాహవాదులు అని పేరు. క్రీస్తు శిష్యుల్లో కనానీయుడగు సీమోను ఈ వర్గానికి చెందినవాడే. ఈ మతావాళ్లు తిరుగుబాటుతో, హింసాకాండతో, దైవరాజ్యాన్ని నెలకొల్పాలని వాదించేవాళ్ళ.శాంతంగా ఉంటే ఆ రాజ్యం రానేరాదని వీళ్ళ భావం. కాని క్రీస్తు ఈ భావాలను అంగీకరించలేదు, పైరు ఎదిగి పంట పండినట్లుగా దైవరాజ్యం దానంతట అదే నెమ్మదిగా ఎదిగి ఫలితానికి వస్తుంది అని అతడు బోధించాడు.