పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్తం తన కుమారుని చిత్తంతో ఏకీభవించాలనే దేవుని కోరిక. అలా ఏకీభవించడం ద్వారా నేడు లోకంలో దేవుని రక్షణ ప్రణాళిక నెరవేరుతుంది. కాని మన చిత్తం క్రీస్తు చిత్తానికి లొంగేలా చేయడం ఎంతమాత్రం సులభంకాదు. దీనికి ఆత్మవరప్రసాదం అవసరం. వరప్రసాదబలం వలనకాని మనం తండ్రి చిత్తంతో ఏకీభవించిన క్రీస్తు చిత్తంతో ఏకీభవించలేం. మనం క్రీస్తు చిత్తంతో ఏకీభవించినపుడు ఆ చిత్తం పరలోకంలోలాగే భూలోకంలో గూడ నెరవేరుతుంది.

పరలోకంలోని నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడే గాని దైవరాజ్యాన్ని పొందండని క్రీస్తు వాకొన్నాడు - మత్త 7,21. కాని ఆయా సందర్భాల్లో దేవుని చిత్తాన్నితెలిసికోవడం ఏలా? ప్రార్ధన ద్వారానే.

దేవుణ్ణి ఆరాధించి అతని చిత్తాన్ని నెరవేర్చేవాడి మనవిని దేవుడు వింటాడు - యోహా 9,31. ఈ పద్ధతిలోనే తిరుసభ క్రీస్తు పేరుమీదిగా దేవునికి ప్రార్థన చేస్తుంది. పరమ పవిత్రురాలైన దేవమాత పునీతులు మొదలైన వారితో ఐక్యమయ్యే తిరుసభ ప్రార్ధన చేస్తుంది. "నీ చిత్తం భూలోకంలో నెరవేరునుగాక" అంటే తిరుసభలో నెరవేరాలనే భావం. క్రీస్తులోలాగే అతని వధువులో గూడ దేవుని చిత్తం నెరవేరాలి. మనం క్రీస్తు చిత్తానికీ, దేవుని చిత్తానికి అంటి పెట్టుకొని వున్నపుడే మన జీవితం పవిత్రమయ్యేది.

4. నేటికి కావలసిన మా అనుదిన భోజనం

ఈ విన్నపంలో చాల భావాలున్నాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం. మొదట "భోజనం" అంటున్నాం. మనకు ప్రాణాన్నిచ్చిన దేవుడు దాన్ని సంరక్షించే భోజనాన్ని కూడ దయచేస్తాడు. ఈ భోజనం భౌతికమైందీ ఆధ్యాత్మికమైందీ కూడ. మనం దేవుని ప్రాణిపోషణా చాతుర్యాన్ని నమ్మాలి. కనుక మన తరఫున మనం ఏమితిందామా ఏమి కట్టుకొందామా అని ఆందోళనం చెందకూడదు - మత్త 6,25. అన్నివస్తువులూ దేవునివే కనుక భగవంతుణ్ణి పొందినవాళ్ళకు అన్ని వస్తువులూ లభిస్తాయి.

నేడు లోకంలో చాలమంది పేదలు భోజనంలేక అల్లాడుతున్నారు. పేద లాజరును పట్టించుకోని ధనవంతులున్నారు. నా సోదరులకు చేసిన కరుణ కార్యం నాకు చేసినట్లే భావిస్తాను అనే ప్రభువు వాక్యం గూడ వుంది. ఈ భావాల ప్రకారం, ఉన్నవాళ్ళ లేనివాళ్ళతో తమ భోజనాన్ని పంచుకోవాలి. ఆర్థిక సాంఘిక రంగాల్లో న్యాయాన్ని పాటించాలి. అనేకులమైన మనమందరం ఒకే రొట్టెలో పాలు పొందాలి. కనుక నిరంతరం మనకున్న వాటిని లేనివాళ్ళతో పంచుకోవాలి. నిర్బంధానికి గురై కాక ప్రేమతోను ఈ పంపిణీ జరగాలి.