పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీ రాజ్యం వచ్చునుగాక అనే వాక్యం ప్రధానంగా క్రీస్తు రెండవమారు వచ్చి దైవరాజ్యాన్ని పరిపూర్ణంగా స్థాపించడాన్ని సూచిస్తుంది. కనుక ఈ విన్నపం భావికాలానికీ ప్రస్తుత కాలానికీ గూడ వర్తిస్తుంది. దైవరాజ్యం ఇప్పడు బలాన్ని పుంజుకొని భవిష్యత్తులో పరిపూర్ణమౌతుంది అనుకోవాలి. ఆత్మ శిష్యులమీదికి దిగివచ్చిన నాటినుండి తానే దైవరాజ్యాన్ని పరిపూర్ణం చేస్తున్నాడు. క్రీస్తు పనిని పరిపూర్తిచేసి మనకు వరప్రసాదాన్ని దయచేసేది అతడే.

దైవరాజ్యమంటే ఆత్మ దయచేసే పవిత్రత శాంతి సంతోషాలే - రోమా 15, 17. ఈ యంత్యకాలంలో దేవుడు మనకు తన ఆత్మను సమృద్ధిగా దయచేసాడు. ఆత్మ దిగివచ్చిన నాటినుండి శరీరానికి అతనికీ మధ్య పోరాటం జరుగుతూనే వుంది - గల 5,16-17. పాపానికి దైవరాజ్యానికి ఏ మాత్రం పొత్తులేదు. కనుక "మీ భౌతిక శరీరాల్లో పాపం పరిపాలనం చేయకూడదు" అన్న పౌలు వాక్యం ప్రకారం జీవించే విశుద్ధ వర్తనులేగాని నిజంగా నీ రాజ్యం వచ్చునుగాక అని దేవుణ్ణి ప్రార్థించలేరు - రోమా 6,12.

దైవరాజ్యపు రాకడ భావికాలానికి సంబంధించింది అన్నాం. ఐనా అది వర్తమానాన్ని విస్మరించదు. ఐతే యిప్పుడు దైవరాజ్యం పెంపు చెందుతుంది అనడానికి గుర్తు ఏమిటి? ఇప్పటి క్రైస్తవుల్లో, శాంతి, న్యాయం సేవ అభివృద్ధి చెందాలి. నేను తోడివారిని ఆదరించి వారికి సేవలు చేస్తే నా హృదయంలో దైవరాజ్యం వేరుపాతుకొన్నట్లు.తోడివారిని పట్టించుకోకపోతే, వారికి అన్యాయం చేస్తే నా యెదలో దైవరాజ్యం ఇంకా వేరూననట్లే. సోదర ప్రేమ లేనిచోట దైవరాజ్యం వుండదు.

3. నీ చిత్తం పరలోకంలోలాగే భూలోకంలో కూడ

దేవుని చిత్తం ఏమిటి? మనం క్రీస్తు ద్వారా రక్షణం పొందాలనే. మానవులందరూ రక్షణాన్ని పొందాలనీ సత్యాన్ని తెలిసికోవాలనీ దేవుని కోరిక - 1 తిమో 2,4. ఈ కోరిక నెరవేరాలనే మనం ఇక్కడ ప్రార్ధించేది.

క్రీస్తు దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. అతడు ఈ లోకంలోకి వచ్చినపుడు దేవా! నేను నీ చితాన్ని నెరవేర్చడానికే వచ్చాను అన్నాడు — హెబ్రే 10,7. గెత్సెమని తోపులో నా చిత్తంగాదు నీ చిత్తమే నెరవేరనీయి అని ప్రార్థించాడు - లూకా 22,42. కడన అతడు తండ్రి చిత్తప్రకారమే చనిపోయాడు. ఆమరణం వల్లనే మనకు రక్షణ కలిగింది - హెబ్రే 10,10.

క్రీస్తు తన శ్రమల ద్వారా విధేయత నేర్చుకొన్నాడు. అతనిలాగే మనం కూడ విధేయులం కావాలి. మనం క్రీస్తుకి విధేయులమైతే దేవునికి విధేయులమైనట్లే. మన