పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ కట్టడాలమీద వ్యయం జేస్తాం. కాని కట్టడాలవలన దైవరాజ్యాన్ని నెలకొల్పలేం. రాయిరప్పలూ సున్నమూ సిమెంటూ మొదలైన వానితో కట్టిన కట్టడాల్లో దేవుడు నెలకొంటాడా? అతడు వసించేది ప్రప్రథమంగా నరుల హృదయాల్లో కనుక దైవరాజ్యాన్ని వ్యాప్తిచేయడమంటే నరుల హృదయాలను సిద్ధం చేయడం, నరులకు తర్ఫీదునిచ్చి వాళ్లు నిండు హృదయంతో భగవంతుని ఆరాధించేలాగ చేయడం.

మొదటి విన్నపంలో నీ నామం పూజింపబడునుగాక అన్నాం, దేవునినామం పూజింపబడాలి అన్నా దేవుని రాజ్యం రావాలి అన్నాభావం ఒక్కటే. నూత్న వేద కాలంలో దైవరాజ్యమంటే క్రైస్తవ సమాజమే. పరిశుద్ధాత్మద్వారా దేవుడు ఈ సమాజంలో నెలకొని వుంటాడు. ఈ క్రైస్తవ సమాజానికి మెస్సీయా తన భాగ్యాలనన్నిటినీ అందిస్తాడు.

4) దేవుని చిత్తం

మూడవ విన్నపంలో దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్ధిస్తున్నాం. దీనిభావం దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలి అనిగాదు. మనం ప్రార్ధించినా ప్రార్థించుకపోయిన అతడు తన చిత్తాన్ని ఏలాగైనా నెరవేర్చుకొని తీరతాడు. కనుక ఈ విన్నపం భావం, మనతరపున మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని.

నరులంతా రక్షణం పొందాలని దేవుని చిత్తం అంటాడు పౌలు -1తిమో 2,4 ఏమి రక్షణం? మనం ఆ దేవునికి పుత్రులం కావాలి, అతనిలాగ పవిత్రులంకావాలి, అతనినుండి నిత్య జీవంపొందాలి. ఇది రక్షణం. కాని ఈ రక్షణం పొందాలి అంటే నరుడు ఓ బిడ్డలాగ దేవునికి విధేయుడు కావాలి. నమ్మికతో ప్రేమతో ఆ తండ్రి ఆజ్ఞలను పాటించాలి. ఈ విధేయత నరునికి కష్టమనిపిస్తుంది. దేవునికి లొంగిఉండడమంటే అతనికి ప్రియపడదు. “తండ్రీ నీచిత్తమే నెరవేరాలి" అని ప్రార్థించిన క్రీస్తు విధేయతే మనకీసందర్భంలో ఆదర్శ మౌతుంది - మత్త 26, 42. ఈ విన్నపంలో విశేషంగా భగవంతునిపట్ల నరుడు చూపవలసిన విధేయతను గూర్చి ప్రార్ధిస్తున్నాం.

ఎందుకోగాని లూకా రచించిన పరలోకజపంలో ఈ విన్నపం పూర్తిగా ඒ*දිංරඩ්යාඩ්. ఇంతవరకు పరలోకజపంలోని తొలిభాగాన్ని పరిశీలించాం. ఈ భాగంలో దేవుణ్ణి తండ్రీ అని సంబోధించడమూ, అతన్ని గూర్చిన మూడు విన్నపాలూ వివరంగా తెలిసికొన్నాం. ఇక, రెండవభాగంలో నరునిగూర్చిన మూడు విన్నపాలూ వస్తాయి.

5) నేటికి కావలసిన ఆహారం

నాల్గవ విన్నపంలో ప్రభుని మనకు కావలసిన ఆహారాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం, ఇక్కడ "ఆహారం" అన్న పదాన్ని విస్తృతార్థంలో స్వీకరించాలి. మనం