పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భుజించే భోజనం ఈ యాహారంలో ఒక భాగంమాత్రమే. మెస్సీయా మనకోసం దేవునినుండి కొనివచ్చే వరాలూ దీవెనలూ అన్నీ ఈ విన్నపంలో ఆహారశబ్దంతో సూచింపబడ్డాయి. ఈ దీవెనలు మన ఆత్మకూ దేహానికిగూడ సంబంధించినవి. ఈ దీవెనలను పొందాలంటే బిడ్డలు తండ్రిమీదలాగ మనమూ దేవుని మీద ఆధారపడాలి. ఆకాశపక్షులనూ పొలంలోని పూవులనూ వర్ధిల్లజేసేతండ్రి, వాటికంటె శ్రేష్టప్రాణులైన నరులను తప్పకుండా పోషిస్తాడుగదా!- మత్త 6,25-34.

భగవంతునినుండి మనం పొందే ఆహారాన్ని పదిమందిమీ కూడి భుజిస్తాం. ఈ యాహారాన్ని భుజించేనరులంతా ఒక్క కుటుంబంగా ఐక్యమౌతారు. దీనివలన మనకు సమాజభావమూ సోదరభావమూ సిద్ధిస్తుంది. ఆ తండ్రి చేతులలోనుండి ఒకే ఆహారాన్ని భుజించేవాళ్లంతా అన్నదమ్ములూ అక్కచెల్లెళ్లలాగ ఒకేకుటుంబంగా ఏకమౌతారు.

ఈ యాహారం మన్నా ఆహారాన్నిగూడ గురుకుతెనుంది. ప్రభువు యిప్రాయేలీయులను ఎడారిలో నలువదియేళ్ల మన్నా ఆహారంతో పోషించాడు - నిర్గ 16, 35, నూత్నయిస్రాయేలీయులమైన మనం మరోయెడారిలో ప్రయాణంజేస్తున్నాం. ఈ లోకమనే యెడారిగుండ పయనంజేసి పరలోకమనే వాగ్గత్తభూమిని చేరుకొంటాం. ఈ మహాప్రయాణంలో క్రీస్తే మనమన్నా అతడే మన ఆహారం. కనుకనే ప్రభువు "పరలోకంనుండి దిగివచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ యాహారాన్ని భుజించేవాడు నిత్యం జీవిస్తాడు. లోకం జీవించడానికి నేనిచ్చే ఆహారం నా శరీరమే" అన్నాడు - యోహా 6,47.

ఈలాగ మనం ఈ విన్నపంలో అడుగుకొనే ఆహారం చాల వస్తువులను సూచిస్తుంది. అది మన ఆత్మకు అవసరమైన వరప్రసాదాన్ని సూచిస్తుంది. మనదేహానికి అవసరమైన భౌతిక అన్నాన్నీ సూచిస్తుంది. ప్రభుని అంగీకరించే మనమంతా సోదరీసోదరుల్లాగ ఐక్యమౌతామనీ సూచిస్తుంది. ఇంకా, మనం స్వీకరించే దివ్య సత్ప్రసాదాన్నీ సూచిస్తుంది.

6) మా యప్పులను మీరు మన్నించండి

మనం బలహీనతవల్ల తండ్రియైన దేవునికి విరోధంగా పాపంజేస్తాం. అతడు నెనరుతో మన తప్పిదాలను క్షమిస్తాడు. ఆ కరుణామయుడు జాలితో తప్పిపోయిన గొట్టెను వెదుక్కుంటూ వెళ్లాడు. ఇల్లవిడిచి వెళ్ళిపోయిన కుమారుని రాకకొరకు తెన్నులు జూస్తుంటాడు - లూకా 15, ఈలాంటి కరుణా మయునికి బిడ్డలమైన మనంకూడ ఆ తండ్రిలాగే జాలిగుణాన్ని అలవర్చుకోవాలి. అందుకే ప్రభువు “మీ తండ్రిలాగే మీరూ కనికరంతో మెలగండి" అని బోధించాడు - లూకా 6, 36.