పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాలమంది పామర జనానికి గొప్పగొప్ప ప్రార్థనా పద్ధతులేమీ తెలియవు. వాళ్ళకు తెలిసింది పరలోక మంగళ వార్తజపాలూ, ఉత్తమ మనస్తాప జపం, విశ్వాస సంగ్రహం మొదలైన శాబ్దిక జపాలు మాత్రమే. వాళ్ళు ఈ జపాలనే మళ్లామల్లా చెప్పకొని దేవునిపట్ల గాఢమైన అనుభూతిని కలిగించుకొంటారు. ఈలాగే జపదండ, దేవమాత ప్రార్థన, అర్యశిష్ణుల ప్రార్ధన మనకెంతో భక్తిని పుట్టిస్తాయి. ఇవన్నీ మనవి ప్రార్థనలే. వీటిద్వారా మనం సులువుగా ప్రార్ధనం జేసికోవచ్చు. అనతి కాలంలోనే దైవానుభూతిని పొందవచ్చు.

5. మనవి జపంలోని శక్తి

మకేరియస్ అనే యెడారిమని ఈలా చెప్పాడు. "పసిబిడ్డ నడవలేదు. తల్లి దగ్గరికి పోలేదు. కాని తల్లి తనకవసరం గనుక ఆమె కొరకు ఏడుస్తుంది. తల్లి ఆ యేడ్పును జూచి జాలి జెందుతుంది. ఆ బిడ్డకు తాను అవసరమని గుర్తిస్తుంది. పసిబిడ్డ నడచి తన దగ్గరికి రాలేదు కనుక తానే ఆ బిడ్డ దగ్గరికి వెళ్తుంది. ఆమెలోని ప్రేమే ఆమెను కదిలించి బిడ్డ దగ్గరికి పంపుతుంది. తాను బిడ్డను లాలించి ఓదార్చి పాలిస్తుంది. ప్రేమమయుడైన భగవంతుడు కూడ భక్తునిపట్ల ఈ తల్లిలాగే ప్రవర్తిస్తాడు. భక్తుడు భగవంతుణ్ణి కోరుకొంటేచాలు ఆ ప్రభువు శీఘమే అతని దగ్గరికి వస్తాడు."

ప్రార్ధనం చేసికొనేపుడు మనం పై వుపమానంలోని పసిబిడ్డ లాంటివాళ్ళం. క్రీస్తు ఈ వుపమానంలోని తల్లిలాంటివాడు. మనం ఆ పసిబిడ్డలాగ క్రీస్తుకి మనవి చేసికొంటే అతడు తల్లిలాగ మనలను ఆదరిస్తాడు. క్రీస్తు మన మనవిని ఆలించడానికి మనం మహా భక్తులమై యుండనక్కరలేదు. ఏ పాపాలు చేయని పవిత్రులమై యుండనక్కరలేదు. క్రీస్తు మనకు అవసరమని గుర్తించి అతన్ని గాఢంగా వాంఛిస్తే చాలు. మనంతట మనం మన అవసరాలను తీర్చుకోలేమని గ్రహిస్తే చాలు. క్రీస్తు మనకు సాయం చేస్తాడని నమ్మి అతన్ని అడుగుకొంటే చాలు. అనగా భక్తితో మనవిప్రార్ధనం చేసికొంటే చాలు. ఆ జపంలో దేవుణ్ణి మన దగ్గరకు తీసికొనివచ్చే శక్తి వుంది.

6. దేవుని మనసు మారుస్తామా?

కొందరు ఈలా ప్రశ్నిస్తారు. మనం ప్రార్ధనం చేసినందువల్ల దేవుడు తన మనసు మార్చుకోడు. అతడు పూర్వం ఏలా నిర్ణయించాడో అలాగే జరుగుతుంది. ఆలాంటప్పుడు మన కష్టాలు అతనితో చెప్పుకోవడంవల్ల ప్రయోజన మేమిటి? మనవి ప్రార్ధనంవల్ల లాభమేమిటి?