పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలియజేయండి - ఫిలి 4,6. ఈ వేదవాక్యాలనుబట్టి మనవి ప్రార్థనలో వుండే శక్తి ఎంత గొప్పదో అర్థం జేసికోవచ్చుగదా!

4. ప్రార్ధనా రహస్యం

మామూలుగా మనం ధ్యానం చేసికోబోతాం. దానిలో కాసేపు మనసు దేవునిమీద నిల్చినట్లే వుంటుంది. అంతలోనే పరాకులు వస్తాయి. మళ్ళా మనసు దేవునిమీదికి త్రిప్పకొంటాం. దేవుణ్ణి గూర్చి ఆలోచిస్తాం. మళ్ళా చిత్తసంచారం. మళ్ళా ప్రయత్నంచేసి మనసు దేవునిమీదికి త్రిప్పకొంటాం, దేవుణ్ణి గూర్చి ఆలోచిస్తాం, మళ్ళామనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈలా పరాకులకు అంతమే వుండదు.

మామూలుగా ధ్యానంలో మనం చేసేదేమిటంటే దేవుణ్ణి గూర్చి ఆలోచించడం. కాని అతడు మన ఆలోచనలకు లొంగడు. అసలు మన ప్రయత్నంవల్ల దేవుణ్ణి పొందలేం. మనంతట మనం అతన్ని చేరలేం. ప్రభువుకి ప్రార్థన చేసికోవడమనే భాగ్యం అతని వరప్రసాదం వల్లనే లభిస్తుంది. ఈ భాగ్యం కోసం మనం వినయంతో అడుగుకోవాలి. బిచ్చగాడిలా అర్ధించాలి. మరొక మార్గంలేదు. తలతో ఆలోచిస్తే దేవుడు దొరకడు. హృదయంతో ప్రేమిస్తే, భక్తితో గాలిస్తే అతడు దొరుకుతాడు.

ప్రార్థనా రహస్యమంతా మనవి ప్రార్ధనం చేసికోవడంలోనే వుంది. మనం దేవుణ్ణి వినయంతో అడుగుకొంటే అతడు మనకు ప్రార్ధనా విధానాన్ని నేర్పుతాడు. శిష్యులు "ప్రభూ! నీవే మాకు ప్రార్థన నేర్పించు" అని మనవి చేసారు. అతడు నేర్పించాడు. మనమూ ఈలాగే చేయాలి. ఈలా కాకుండ మన తలతో దేవుణ్ణి గూర్చి ఆలోచించబోతే అతడు దొరకడు. వినయంతో భక్తిపూరితమైన హృదయంతో ప్రభువునే ప్రార్థన నేర్పమని అడుగుకొంటే అతడు దొరుకుతాడు. ప్రార్థనా రహస్యం మనవి ప్రార్థనను నేర్చుకోవడంలోనే వుంది. ఈ ప్రార్థనను సాధిస్తే మనకు జపంజేసే విధానం తెలిసినట్లే.

మనకు చిన్నచిన్న సుకృత జపాలున్నాయి. వీటినే భక్తితీక్షణ జపాలని కూడ అంటారు. ఇవి తరచుగా వేదవాక్యాలే. ఈ లఘు జపాలను భక్తితో జపిస్తూ దేవునికి మనవి జేసికొంటూ బోతే ఎంతో భక్తి పడుతుంది. మనసు దేవునిపై నిలుస్తుంది, ఉదాహరణకు - ప్రభువే నాకు కాపరి, నా దేవా నా ప్రభువా, నా యాత్మను నీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాను, ప్రభూ నేను నీ నుండి ఎడబాయకుందునుగాక, నా యేసువా నాకు రక్షకుడివిగా నుండు మొదలైనవి సుకృత జపాలు. బైబులు ఈలాంటి వాక్యాలతో నిండి వుంటుంది, ఇవి మనవి ప్రార్థనకు బాగ వుపయోగపడతాయి. భక్తి పట్టిస్తాయి కూడ.