పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. మన ప్రార్ధనం దేవుని చిత్తాన్నీ మనసునీ మార్చదు. అతడు ఏ నాటికీ మారడు. మారేది మనమే. ఐనా అతడు మన సహకారాన్నీ ప్రార్థననూ కోరతాడు, మన ప్రార్థనను ముందుగా చూచే దేవుడు ఆయా నిర్ణయాలు చేస్తాడు. మన ప్రార్ధన లేనిదే అతడు మనలను రక్షించడు. కనుక మన తరపున మనం ప్రార్థన చేయవలసిందే.

ఐతే, భక్తుల ప్రార్ధనవల్ల ప్రభువు మనసు మార్చుకొన్నాడని బైబులు చాల తావుల్లో చెప్తుంది. కానావూరి పెండ్లిలో ద్రాక్షరసం తక్కువపడింది. పెండ్లివారికి ద్రాక్షరసం ఐపోయింది. వారికి సహాయం చేయమని మరియమాత క్రీస్తుని అడిగింది. క్రీస్తు నా గడియ ఇంకా రాలేదన్నాడు. ఐనా మరియు నిరుత్సాహ పడకుండా పనివారితో మీరు ఆయన ఆదేశించినట్లుగా చేయండని చెప్పింది. క్రీస్తు ఆమె కోరిక ప్రకారం నీటిని రసంగా మార్చాడు. ఇక్కడ నా గడియ ఇంకా రాలేదన్న క్రీస్తు మరియు మనవివల్ల తన మనసు మార్చుకొని అద్భుతం చేసాడు గదా?

హిజ్కియా భక్తిగల రాజు. ఓసారి అతడు జబ్బుపడ్డాడు. యెషయా ప్రవక్త నీవిక బ్రతకవు. చనిపోకముందే నీ కార్యాలను చక్కబెట్టుకో అని దైవసందేశాన్నితెలియజేసాడు. ఆ సందేశం విని హిజ్కియా మనసు నొచ్చుకొన్నాడు. దిగులుతో ప్రభూ! ఇన్నాళ్ల చిత్తశుద్ధితో నిన్ను సేవించాను. నీ చిత్తప్రకారం జీవించాను. ఇప్పడు నన్ను కాపాడవా అని ప్రార్ధించాడు. ఆ ప్రార్థనకు యావే ప్రభువు మనసు కరిగింది. ప్రవక్త మొదటి సందేశం చెప్పి రాజప్రాసాదం దాటి పోకముందే ప్రభువు అతన్ని వెనక్కు పంపించి క్రొత్త సందేశం చెప్పించాడు. దాని సారాంశం ఏమిటంటే, హిజ్కియా వ్యాధినుండి కోలుకొని ఇంకా 15 ఏండ్లు బ్రతుకుతాడు. ఇక్కడ ప్రభువు తన మనసు మార్చుకొన్నాడు గదా? - 2 రాజు 20, 1-6.

మోషే పది ఆజ్ఞలు తీసికొని రావడానికి కొండమీదికి వెళ్ళాడు. కొండ క్రింద యిస్రాయేలు ప్రజలు విశ్వాసఘాతకులై దూడను ఆరాధించారు. ప్రభువు ఆగ్రహం జెంది యిస్రాయేలు ప్రజలను నాశం చేస్తానని శపథం చేసాడు. వారికి బదులుగా మోషే నుండి క్రొత్త జాతిని పట్టిస్తానన్నాడు. కాని మోషే యిప్రాయేలును మన్నించి వదలివేయమని మనవి చేసాడు. నీవు ఈ ప్రజలను మన్నించకపోతే నా పేరును నీ జీవగ్రంథం నుండి కొట్టివేయమన్నాడు. భక్తిగల మోషే ప్రార్థనను జూచి దేవుడు మనను మార్చుకొన్నాడు. యిస్రాయేలీయులను నాశం చేయలేదు - నిర్గ 32, 11-14.

యావే పాపపు నగరాలైన సాదొమ గొమర్రాలను నాశం చేయడానికి వచ్చాడు. కాని తన సంకల్పాన్ని ముందుగా తన భక్తుడైన అబ్రాహాముకి తెలియజేసాడు. వెంటనే అబ్రాహాము ఆ నగరాల కొరకు దేవునికి మనవి చేసాడు. మొదట 50 మంది