పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిన్ను నీవే సిలువమిద ఆత్మార్పణం చేసికొని
సమాధి అనే సారవంతమైన క్షేత్రంలో
ఓ విత్తనంలా నాటుకొన్నావు
ఆ క్షేత్రంనుండే మల్లా ఓ అంకురంలా మొలకెత్తావు
ఉత్థానమనే పంట పండావు నూరంతలుగా
ఈలా చావులోనే జీవం వుందని నిరూపించావు,
స్వార్థత్యాగంలోనే విజయసిద్ధి వుందని ధ్రువపరచావు.
అహాన్ని జయిస్తేనేగాని అమృతసిద్ధి లేదని రుజువుచేసావు
నీ కృపవల్ల ఈ వొక్క సత్యాన్ని
మేము జీర్ణంచేసికొంటేచాలు
పండిన పండపొలంలా మా జీవితంకూడ ధన్యమౌతుంది.

39. సిలువను చేకొనడం

లూకా 9,23-24

ప్రభూ! నీవు "నా శిష్యుడు కాగోరేవాడు
తన్ను తాను నిరాకరించుకొని
అనుదినం తన సిలువను మోసికొంటూ
నా వెంట రావాలి" అని బోధించావు

నీ బోధల్లో దీనికి మంచింది లేనేలేదు
గురువు కొకత్రోవా శిష్యుడి కింకోత్రోవా వుంటుందా?
నీవు బాధామయ మార్గంలో నడచిపోయావు
కనుక నీ యనుచరులకు కూడ అదే మార్గం

తన్ను తాను నిరాకరించుకోందే
తనకుతాను చనిపోందే
జీవమెక్కడిది?

తన సిలువను తాను చేకొనందే
తాను కష్టపు త్రోవను త్రాక్కందే
ఉత్థానపు మహిమ యొక్కడిది?

నీ మరణోత్దానాలను
మా జీవితంలో ప్రతిబింబించుకోందే
నిత్య జీవనమెక్కడిది?