పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోహా 15, 13. క్రీస్తుమరణం అతని ప్రేమకి ప్రధాన చిహ్నం. "క్రీస్తు మనలను ప్రేమించాడు. దేవునికి ప్రీతినిగూర్చే సువాసనతో కూడిన అర్పణంగాను బలిగాను తన్ను తాను అర్పించుకొన్నాడు" - ఎఫె 5,2. కనుక ప్రభువు సిలువ మరణం ద్వారాను, అటు తర్వాత అతని ప్రక్కను తెరవడం ద్వారాను అతని ప్రేమ రుజువైంది. ప్రభువు తన్ను ప్రేమించినవాళ్ళని కడపటిదాకా ప్రేమించాడు. గాఢంగా ప్రేమించాడు - యోహా 13,1. తన ప్రేమను నిరూపించుకోవడానికే అతడు హృదయాన్ని ఈటెతో పొడిపించు కోవడానికి అంగీకరించాడు. ఆ హృదయం కట్టకడపటి నీటిబొటూ నెత్తురుబొటల్లా ఒలికి, ఇక యింతకంటె గొప్ప ప్రేమ లోకంలో యొక్కడా లేదని నిరూపించింది. ఏ సంస్కృతిలోనైనా, ఏ భాషలోనైనా హృదయం ప్రేమకి చిహ్నం గదా? బైబుల్లోగూడ హృదయం ప్రేమకి గుర్లే. కనుక సిలువమీద పొడవబడిన, తెరవబడిన, క్రీస్తు హృదయం అతని ప్రేమకు చిహ్నంగా వుంటుంది. కావున క్రీస్తు హృదయమంటే క్రీస్తుప్రేమ అన్నమాట. బోనవెంచరు భక్తుడు ఈలా వ్రాసాడు. "ఈటెతో పొడవడంవల్ల క్రీస్తహృదయం గాయపడింది. ఈ గాయం మనకంటికి కనిపిస్తుంది. కాని మన కంటికి కన్పించే ఈ గాయం మన కంటికి కన్పించని శ్రీ హృదయం ప్రేమగాయానికి గుర్తుగా వుంటుంది".

ఈ హృదయం కేవలం క్రీస్తు ప్రేమకు చిహ్నం మాత్రమే కాదు. ప్రండెండవ భక్తినాథ పోపుగారు నుడివినట్లు, మన రక్షణమంతాగూడ సంగ్రహంగా దానిలో ఇమిడి వుంది. ఆ ప్రభువు మనకొరకు తన హృదయాన్నే అర్పించాడు. ఆ హృదయమే, దానిలోని ప్రేమే, మనకు రక్షణాన్ని ఆర్ధించిపెట్టింది. మన రక్షణకు కారణమైన ఈ హృదయం కరుణాపూరిత మైందికూడ, నేడు మనకు కావలసిన వరప్రసాదాలన్నీ ఈ హృదయంనుడే లభిస్తాయి. కనుక మనం ఈ హృదయాన్ని భక్తిభావంతో ధ్యానించుకోవాలి.

5. భక్తుల ప్రార్థనలు

శతాబ్దాల పొడుగునా భక్తులు శ్రీహృదయంపట్ల భక్తిని జూపుతూ వచ్చారు. ఆ పుణ్యాత్ములు తమ భక్తిభావాలను ప్రార్థనల్లో వెలిబుచ్చారు. ఆలాంటి ప్రార్థనలను కొన్నిటిని ఇక్కడ పొందుపరుస్తున్నాం. ముందే చెప్పినట్ల, తొలి శతాబ్దాల్లో ప్రత్యేకంగా శ్రీ హృదయభక్తి అంటూ యేమీ లేదు. ప్రాచీన క్రైస్తవులు క్రీస్తు ప్రక్కలో తగిలిన గాయంపట్ల గాధమైన భక్తిని చూపేవాళ్ళ .