పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈటె క్రీస్తు ప్రక్కను పొడిచి గాయంచేసింది. కొండబండలో నెర్రె ఏర్పడింది. ఆనెర్రెలో పావురాళ్ళ వసిస్తాయి. క్రీస్తు భక్తుడా లే! రాతి నెర్రెలో గూడుకట్టుకొనే పావురం లాగే నీవుకూడ తెరువబడిన క్రీస్తు హృదయంలో నివాసమేర్పరచుకో" ఈ భక్తుడు భావించినట్లు క్రీస్తు హృదయం మనకు ఆశ్రయస్థానం. శోధనల్లో అది మనం తలదాచుకొనే దుర్గం. శ్రమల్లో బడలికల్లో అది మనకు విశ్రాంతి స్థానం. పాపులమైన మనకు అది రక్షణస్థానం.

శ్రీహృదయ దర్శనాలు పొందిన 18వ శతాబ్దపు భక్తురాలు మార్గరెట్ మేరి ఈలా నుడివింది. "మనం ప్రభువు హృదయంలోనికి ప్రవేశించి అతని ప్రేమను అనుభవానికి తెచ్చుకొంటే అతనికి ప్రీతిపాత్రులంగా జీవించవచ్చు. ప్రభువు భక్తులంతా అతని హృదయంలోనే వసిస్తారు. ఆ హృదయం ఆనందకరమైన నివాసం. దానిలో వసించేవాళ్లు ఏ యపాయాలకీ గురికారు, ఏ శోధనలకీ లొంగరు". ఈ పునీతురాలు నుడివినట్లుగా క్రైస్తవభక్తుడు క్రీస్తు హృదయంలో వసించడం అలవాటు చేసికోవాలి. ఆ ప్రభువు ప్రేమని అర్థంచేసికొని అతనికి బదులు ప్రేమను చూపడం అభ్యాసం చేసికోవాలి.

2. క్రీస్తుహృదయం ప్రేమకు చిహ్నం

"మీరుకూడ విశ్వసించడానికి అతడు సత్యం చెపున్నాడని అతనికి తెలుసు" అన్నాడు యోహాను తన సువిశేషంలో - 19, 37. క్రీస్తు ప్రక్కను యథార్థంగా ఈటెతో పొడిచారు అన్నది ఇక్కడ యోహాను చెప్పిన సత్యం. కాని ఈ సత్యాన్ని తెలిసికొని మనం ఏమి విశ్వసిస్తాం? క్రీస్తు ప్రక్కనీ హృదయాన్నీ తెరిచారు అనే సత్యాన్ని గుర్తించి మనం తండ్రి ప్రేమనీ, క్రీస్తుప్రేమనీ విశ్వసించాలి.

తండ్రి మనలను ప్రేమించాడు అనడానికి ప్రబల తార్మాణం క్రీస్తుని పంపడమే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తనఏకైక కుమారుడ్డి పంపాడు. ఆ కుమారుడ్డి ప్రేమించే ప్రతినరుడూ నాశం కాకుండా నిత్యజీవం పొందడానికై తండ్రి ఆలా చేసాడు" - యోహా 8,16. కనుక నరుడుగా అవతరించిన క్రీస్తు తండ్రి ప్రేమకు తార్మాణం. ఆ తండ్రి మనలను ప్రేమించి మన పాపవిమోచనకు క్రీస్తుని పంపాడు, - 1యో 4,10. కనుక క్రీస్తు సిలువమరణమూ, అతని ప్రక్కను ఈటెతో పొడవడమూ, తండ్రి ప్రేమను చాటిచెస్తాయి. సిలువమీద తెరువబడిన క్రీస్తు పార్శ్వం తండ్రి ప్రేమను మాత్రమేగాదు, క్రీస్తు ప్రేమనుగూడ యెలుగెత్తి చాటుతుంది. ప్రభువు మనకొరకు ఆత్మార్పణం చేసికొన్నాడు. స్నేహితుల కొరకు ప్రాణాన్ని దారబోసే వానికంటే ఎక్కువ ప్రేమగల వాడెవడూలేడు.