పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక, దివ్యసత్ప్రసాదం జ్ఞానస్నానం అనే సంస్కారాలు శ్రీసభను నిర్మిస్తాయి. కనుక ఈ సంస్కారాలు పుట్టినచోటనే శ్రీసభకూడ పుట్టింది. సిలువమీద తెరువబడిన క్రీస్తు పార్శ్వం నుండి, అనగా అతని హృదయం నుండి, శ్రీసభ ఉద్భవించింది. విశ్వాసులమైన మనమే ఈ శ్రీసభ.

నిద్రపోయిన మొదటి ఆదాము ప్రక్కలోనుండి ఏవ ఉద్భవించింది కదా! ఆలాగే సిలువమీద మరల నిద్రించిన రెండవ ఆదాము క్రీస్తు ప్రక్కలోనుండి రెండవ యేవలాగ శ్రీసభ ఉద్భవించింది.

పూర్వం నోవా ఓడకట్టి దానికొక ద్వారాన్ని నిర్మించాడు. జలప్రళయంవల్ల నాశంగాకుండా బ్రతికివుండే జంతువులన్నీ ఈ రంధ్రంగుండా ఓడలో ప్రవేశించి చావని తప్పించుకొన్నాయి. ఈలాంటి రంధ్రం కల్గిన నోవావోడ తెరువబడిన క్రీస్తు పార్వానికి సంకేతంగా వుంటుందని చెప్పాడు అగస్టీను భక్తుడు.

4. శ్రీహృదయ భక్తి

క్రీస్తు పార్శ్వమంటే అతని హృదయమే. అతని హృదయంలో నుండి వెలువడిన నెతురునీళ్ళ భావాలు పరిశీలించి చూచాం, ఈ యధ్యాయంలో మనం ఆ హృదయంపట్ల చూపవలసిన భక్తిభావాలను పరిశీలిద్దాం.

1. శ్రీహృదయం మనకు ఆశ్రయస్థానం

సైనికుడు క్రీస్తు ప్రక్కను ఈటెతో పొడిచి తెరవడాన్ని గూర్చి చెపూ నాల్గవ శతాబ్ద భక్తుడైన క్రిసోస్తం ఈలా వ్రాసాడు. "ఆ సైనికుడు పరిశుద్ధదేవాలయం గోడకు కన్నంవేసాడు. ఆ దేవాలయంలోని నిధి నాకంటబడింది. వెంటనే నేను దాన్ని స్వాధీనం చేసికొన్నాను" క్రిసోస్తం పేర్కొన్న ఈనిధి శ్రీహృదయమే.

సిలువమీద ప్రభువు హృదయం తెరువబడినప్పటి నుండి అది భక్తులకు ఆశ్రయస్థానమైంది. భక్తులు చాలమంది తాము ఆ హృదయంలో వసించినట్లుగా చెప్పకొన్నారు. ఈ భావాలను కొంచెం పరిశీలిద్దాం.

పదమూడవ శతాబ్దపు భక్తుడైన బోనవెంచర్ ఈలా వ్రాసాడు. "ప్రభువు హృదయంలో వసిస్తే ఎంతో ఆనందంగా వుంటుంది. ప్రభూ! నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. ఈ మనవిని నీవు ఆలించే జపాల్లో చేర్చు నన్నుపూర్తిగా నీ హృదయంలోనికి రాబట్టుకో. ప్రభూ! నీ ప్రక్కను ఈటెతో ఎందుకు పొడిచారు? మేము నీ హృదయంలోకి ప్రవేశించే మార్గం ఏర్పడ్డానికే గదా! మేము ఈ ప్రపంచ వ్యామోహాల నుండి వైదొలగి నీ హృదయంలో నివాసం ఏర్పరచుకోవడానికే గదా!