పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనలాగా ప్రాచీన క్రైస్తవులు శ్రీ హృదయభక్తిని ఎరుగరు. కాని వాళ్ళకు క్రీస్తు గాయాలపట్ల, విశేషంగా అతని ప్రక్కలోని గాయంపట్ల, అపారమైన భక్తి వుండేది. రానురాను క్రైస్తవ ప్రజలు క్రీస్తు ప్రక్కలోని గాయంలో అతని హృదయాన్ని గుర్తించడం మొదలెట్టారు. ఇది ఆత్మప్రేరణంవల్ల జరిగింది. అనగా తొలిరోజుల్లో అంత స్పష్టంగా లేని శ్రీ హృదయ భక్తి రానురాను స్పష్టమైందన్నమాట.

శ్రీహృదయ ఉత్సవపూజలోని "ప్రెఫేస్" ప్రార్థన ఈలా చెప్తుంది. "క్రీస్తు సిలువమీది కెత్తబడినపుడు మన కొరకు ప్రాణాలర్పించాడు. మనపట్ల అతనికిగల ప్రేమ అంత గొప్పది. గాయపడిన అతని ప్రక్కలో నుండి నీళ్ళూ నెత్తురూ స్రవించాయి. ఈ ప్రక్కయే శ్రీసభలోని సంస్కారాలన్నిటికీ ఆధారం. రక్షకుడు తెరువబడిన తన హృదయంలోనికి నరులందరినీ ఆహ్వానిస్తాడు, ఆ రక్షణప ఊటనుండి మనం ఆనందంతో జలాన్ని స్వీకరించవచ్చు", క్రీస్తు హృదయం ఆత్మకూ, వరప్రసాదాలకూ, రక్షణకూ నిలయమని ఈ ప్రార్ధనం భావం, ఫలితాంశమేమిటంటే, క్రీస్తు ప్రక్కలోనుండి లేదా అతని హృదయంలో నుండి ఆత్మ వెలువడుతుంది. కనుక శ్రీ హృదయానికీ ఆత్మకీ చాల దగ్గరి సంబంధం వుంది. శ్రీహృదయభక్తి ఆత్మభక్తికి దారిదీస్తుంది. ఆత్మభక్తి శ్రీహృదయభక్తిని అధికం చేస్తుంది. అవి పరస్పర సహాయకారులు.

4. దివ్యసత్రసాదమూ, జ్ఞానస్నానమూ, శ్రీసభా

క్రీస్తు ప్రక్కలోనుండి కారిన నెత్తురు అతడు పాస్క గొర్రెపిల్లలాగ బలికావడాన్ని సూచిస్తుందని చెప్పాం. అతని ప్రక్కలో నుండి కారిన నీళ్లు ఆత్మనీ వరప్రసాదాలనీ సూచిస్తాయని చెప్పాం. కాని ప్రాచీన పితృపాదులు ఈ రక్తజలాలకు పై యర్ధాలనేగాక వేరే అర్థాలనుగూడ చెప్పారు. ఈ యంశాన్ని ప్రస్తుతం పరిశీలిద్దాం.

క్రీస్తు పార్శ్వ్ం నుండి కారిన రక్తం అతని స్వీయబలితోపాటు దివ్యసత్రసాదాన్ని గూడ సూచిస్తుంది. దివ్యసత్రసాదమంటే ప్రభువు శరీరరక్తాలే కదా? ఆ రక్తమే అతని పార్శ్వం నుండి వెలువడింది.

క్రీస్తు పార్శ్వం నుండి కారిననీళ్ళు ఆత్మతోపాటు, వరప్రసాదాలతోపాటు, జ్ఞానస్నానాన్నిగూడ సూచిస్తాయి. నీళ్ళతోనే గదా మనం జ్ఞానస్నానం పొందేది? జ్ఞానస్నానానికీ ఆత్మకీ వరప్రసాదానికీ దగ్గరి సంబంధం వుంది. జ్ఞానస్నానంలో మనం ఆత్మను పొందుతాం. ఈ యాత్మే మనకు అన్ని వరప్రసాదాలనూ దయచేసేది. కనుకనే తండ్రి అన్ని భాగ్యాలకూ మారు పేరుగా ఆత్మను మనకు దయచేస్తాడు - లూకా 11,13. మెస్సీయా మన కొరకు కొనివచ్చే సకల భాగ్యాలుకూడ ఈ యాత్మలోనే యిమిడి వుంటాయి.