పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాపగ్రస్తుడైంది తన పాపాలకొరకుగాదు, మన పాపాలకొరకు - గల 8,13. అతడు స్వయంగా మన పాపాల ఫలితమైన శాపాన్ని అనుభవించాడు. మనలను మాత్రం ఆ శాపంనుండి విముక్తులను చేసాడు. కాని అతడు ఆ శాపాన్ని అనుభవిస్తూ దాని బాధను భరించలేక నా దేవా నా దేవా అని విలపించాడు.

పూర్వవేద ప్రజలు కిప్పూర్ అనే ప్రాయశ్చిత్త దినాన తమ పాపాలన్నీ ఒక మేకమీద మోపి దాన్ని అడవిలోకి తోలేవాళ్ళు అది వాళ్ళ పాపాలను మోసికొనిపోయేది — లేవీ 16, 20-22. ఈ మేక మన పాపాలను భరించే క్రీస్తుని సూచిస్తుంది. మన పాపభారం ఆ ప్రభువుని పూర్తిగా కృంగదీసింది. కనుకనే అతడు సిలువమీద ఇలా రోదనం చేయవలసి వచ్చింది.

యెషయా బాధామయ సేవకుణ్ణి పేర్కొన్నాడు. ప్రభువు మన పాపభారాన్నంతటినీ ఈ సేవకుని భుజాలమీద మోపాడు

"మనమంతా గొర్రెల్లాగ త్రోవదప్పి నాశమైపోయాం. ప్రభువు మన పాపాల శిక్షను అతనిమీద మోపాడు” అని పల్మాడు - యెషయా 53,6. ఈ బాధామయ సేవకుడు క్రీస్తే మన కిల్బిషభారాన్ని భరించలేక దేవా కరుణించు అని దీనంగా విలపించాడు ఆ సేవకుడు.

ఇక్కడ క్రీస్తు మానసిక వ్యధనుగూడ అర్థంచేసికోవాలి. భగవంతుడు సృష్టినిచేసి మానవులను కలిగించినపుడు జ్యోతినిగూడ కలిగించాడు. అప్పటినుండి ఆ జ్యోతి నిత్యమూ నరులతో వుంటూ వచ్చింది. అసలు జ్యోతి భగవంతునికే సంకేతం. కనుకనే కీర్తనకారుడు "నీ వెలుగులో మేమూ వెలుగును చూస్తాం" అన్నాడు - కీర్త 36,9. క్రీస్తు ఈ వెలుగుగానే లోకంలోకి వచ్చాడు. జగతికి జ్యోతిని నేనేనని చెప్పాడు - యోహా 8, 12, ఐనా క్రీస్తు ఓ వెలుగులా లోకంలోనికి వచ్చి దేదీప్యమానంగా ప్రకాశించినా చీకటి ప్రపంచం మాత్రం అతన్ని అంగీకరించలేదు - యోహా 1,5, అతడు తనవాళ్ళ చెంతకువస్తే వాళ్ళే అతన్ని సిలువమీద కొట్టి చంపిస్తున్నారు. తన ప్రజలే తన్ను అంగీకరించకపోవడమనేది అతనికెంతో మానసిక వ్యధను కలిగించింది - యోహా 1,11,

ఐనా క్రీస్తుసిలువమీద నిరాశచెందలేదు. భగవంతుడు తన్ను పూర్తిగా విడనాడాడనీ, తనకిక సద్దతి లేదనీ భావించలేదు. తండ్రి నరుల పాపాలకు తన్నలా శిక్షిస్తున్నాడనీ, ఆ చీకటి గడియలు అంతరించాక మళ్ళా వెలుగు ప్రకాశిస్తుందనీ అతనికి తెలుసు. మరణమే తుదిమెట్ట కాదనీ తర్వాత ఉత్తానముంటుందనీకూడ అతడు గ్రహించాడు. మరణంద్వారాలాగే ఉత్తానంద్వారాగూడ తాను ప్రజలను రక్షిస్తానని అతడు నమ్మాడు. కనుక ప్రభువు సిలువమీద నిరాశకు గురయ్యాడనికానీ, తండ్రి అతన్ని పూర్తిగా విడనాడాడనికానీ చెప్పకూడదు.