పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలా తప్పుకోవాలంటే వాళ్ళ తోడి పేదలకు అపకారం చేయకుండా వుంటేనే చాలదు. దరిద్రులకు బుద్ధిపూర్వకంగా ఉపకారం చేయాలి కూడ. అనగా తమ సిరిసంపదలను లేనివాళ్లతో కొలదిగానైనా పంచుకోవాలి. దీనికి తొలినాటి యెరూషలేము సమాజం చక్కని ఆదర్శం - లూకా 4, 35. పూర్వగురువుల సహాయంతో నేడు క్రైస్తవుల్లో పేదవర్గాలవాళ్ళ చాలమంది విద్య గణించి చిన్నవో పెద్దవో ఉద్యోగాలు చేపట్టారు. కనుక వీళ్ళ ఆర్థికస్థాయి పెరిగింది. ఈలాంటివాళ్లు తమ వర్గాల్లో ఇంకా అట్టడుగుననే వున్నపేదవాళ్లకు చేయూత నివ్వాలి. ఉన్నవాడు ఒక్కొక్కడు కనీసం ఒక్కపేదకుటుంబాన్నయినా ఆదుకోవాలి. పాలల్లోకి పంచదారలేక ఒకమ్మ ఏడుస్తూంటే నీళ్ళల్లోకి ఉప్పగల్లు లేక మరొకమ్మ ఏడుస్తూందని తెలుగు సామెత. పాలల్లోకి పంచదారను సంపాదించుకొన్నవాళ్ళ నీళ్ళల్లోకి ఉప్పగల్ల సంపాదించుకోలేనివాళ్ళకు తప్పకుండా సహాయం చేయాలి. ధనం తెచ్చిపెట్టే శోధనలకు గురికాకుండా వుండడానికీ, దాన్ని సద్వినియోగం జేసికోవడానికీ ఇంతకంటె ఉత్తమ మార్గం లేదు. ఆసబోతుతనంతో డబ్బుని కూడబెట్టుకొంటే దాని దుష్టశక్తి హెచ్చుతుంది. డబ్బునే పేదసాదలకొరకు వినియోగిస్తే దాని దుష్టశక్తి సచ్చక్తిగా మారుతుంది. కనుకనే లూకా సువిశేషం డబ్బుని దానానికి వినియోగించమని మాటిమాటికి హెచ్చరిస్తుంది - 12, 23.

కడన, ధనికులు మాకు సిరి అబ్బిందిలే అని మిడిసిపడకూడదు. "ప్రభువు అధిపతులను ఆసనాలనుండి పడడ్రోసి దీనులను లేవనెత్తాడు. ఆకలిగొన్నవారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసాడు" అని చెప్పంది మరియ నుడివిన మహిమగీతం - లూకా 1, 52-53. కనుక కలిమి గలవాళ్ళకు వినయం తగుతుంది.