పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. పేదల పాట్ల

బైబులు భాష్యం • 20

1. నీవలె నీ పొరుగువారిని ప్రేమించాలి - మార్కు 12,31

ఓమారు ఓ ధర్మశాస్త్ర బోధకుడు ఆజ్ఞలన్నిటిల్లోను ప్రధానమైన ఆజ్ఞయేమిటని క్రీస్తుని ప్రశ్నించాడు. ప్రభువు "దేవుణ్ణి నిండు హృదయంతో ప్రేమించాలి, నీవలె నీ పొరుగువారినీ ప్రేమించాలి" అని జవాబిచ్చాడు. ప్రస్తుతానికి దేవుణ్ణిగాదు, పొరుగువారిని ప్రేమించడాన్ని గూర్చి విచారిద్దాం. మన తోడి ప్రజల్లో అధిక సంఖ్యాకులు పేదవాళ్లు, కనుక పొరుగువారిని ప్రేమించడమంటే పేదసాదలైన తోడి ప్రజలను ఆదరించడమూ, కనికరముతో చూడ్డమూను. ఈ దేశములో పేదసాదలు అనుభవించే కడగండ్ల అన్నీయిన్నీ కావు. ఈ పొత్తంలో పేదల పాట్లను కొన్నిటిని పరిశీలిద్దాం.

2. పీడితులకు విమోచనాన్ని ప్రకటించడానికి - లూకా 4,18

నజరేతు సమాజమందిరంలో ప్రభువు బహిరంగబోధను ప్రారంభించాడు. పేదలకు సువార్తా, చెరలో నున్నవారికి విడుదలా, గ్రుడ్డివారికి చూపూ, పీడితులకు విమోచనమూ లభించేలా చేయడమే తన ధ్యేయంగా పెట్టుకొన్నాడు ప్రభువు. అంతకు ఎన్మిది వందల యేండ్లకు పూర్వమే యెషయా ప్రవక్త బాబిలోనులో బందీలై దేవరించే యూదులకు ఈ భాగ్యాలన్నీ లభిస్తాయని ప్రవచనం చెప్పాడు. తన నాటి పీడితప్రజకు క్రీస్తకూడ ఇవే భాగ్యాలు లభింపజేయాలని కోరుకొన్నాడు. కనుక యిక్కడ క్రీస్తు యెషయా ప్రవచనాన్ని యథాతథంగా ఉదాహరించాడు.

ఇక, నేడు మన దేశప్రజల స్థితిగతులు కూడ ఈలాగే ఉన్నాయి. ఇండియాలో ప్రస్తుతం 100 కోట్లమంది జనం ఉన్నారు. అనగా ప్రపంచ జనాభాలో ఏడవవంతు. మనదేశంలో దాదాపు ఐదులక్షల గ్రామాలున్నాయి. మన జనాంగంలో 80 శాతం అనగా 80 కోట్లమంది ఈ గ్రామాల్లోనే వసిస్తున్నారు. గ్రామాల్లో జీవిత సదుపాయాలు అట్టే వుండవు. కనుక ఈదేశ దౌర్భాగ్యమైనా, సౌభాగ్యమైనా గ్రామ జీవితంమిూదనే ఆధారపడి వుంటుంది.