పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ధనాపేక్షను పరిత్యజించందే దైవరాజ్యం లేదు

ఓ మారు ఓ ధనికయువకుడు క్రీస్తు చెంతకువచ్చి నిత్య జీవం పొందడానికి ఏమి చేయాలో చెప్పమని అడిగాడు. ప్రభువు దైవాజ్ఞలను పాటించమని చెప్పగా అతడు నేను చిన్ననాటినుండి ఆజ్ఞలను పాటిస్తూనే వున్నాని జవాబిచ్చాడు. క్రీస్తు అతనితో "ఆలాగయితే నీయాస్తిపాస్తులను అమ్మి పేదలకు దానంజేయి. నీవు వచ్చి నన్ను వెంబడించు" అని చెప్పాడు. కాని అతడు చాల ధనవంతుడు. తనసంపదలను వదలుకోవడానికి అతనికి మనసురాలేదు, కనుక అతడు క్రీస్తు పలుకులకు బాధపడి వెళ్ళిపోయాడు - మార్కు 10, 17-22. ఈ యువకుడు ధనాపేక్షను వదలుకోలేక పోయాడు. కనుక క్రీస్తు శిష్యుడై దైవరాజ్యాన్ని సంపాదించుకోలేకపోయాడు.

అతడు వెళ్ళిపోయాక ప్రభువు ధనవంతుడు దైవరాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టమని శిష్యులకు బోధించాడు. పూర్వవేదం సంపదను దేవుని వరంగా ఎంచుతుందని చెప్పాం గదా! యూదుల రబ్బయిలుకూడ ఆలాగే బోధించారు. ఇప్పుడు క్రీస్తు సంపదలను తక్కువ చేయడంజూచి శిష్యులు విస్తుపోయారు. ప్రభువు తన భావాలను ఇంకా వివరించి చెప్పగోరి "ధనవంతుడు దైవరాజ్యంలో ప్రవేశించడం కంటె ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం" అని పల్కాడు - 17,25. ఇది చాల కటువైన వాక్యం. కనుకనే పూర్వం నుండి వ్యాఖ్యాతలు ఈ వాక్యంలోని కటుత్వాన్ని కొంతవరకైనా తగ్గించాలని ప్రయత్నం చేసారు. ఇక్కడ "సూదిబెజ్జం" అనేది ఆ రోజుల్లో యెరూషలేము ప్రాకారంలోవుండే ఓ ద్వారానికి పేరని కొందరు అర్థం చెప్పారు. ఒంటెలు ఆ ద్వారం గుండా కొంచెం కష్టంగా దూరిపోయేవి. ఆలాగే ధనవంతుడు కూడ కొంచెం కష్టంగా దైవరాజ్యం చేరుకొంటాడని అర్థం చెప్పారు. కాని ఈలాంటివన్నీ వట్టి అపవ్యాఖ్యలు. క్రీస్తు ఇక్కడ బుద్ధిపూర్వకంగానే ఈ యతిశయోక్తిని వాడాడు. ఒంటె అంత పెద్ద జంతువు సూది బెజ్జమంత చిన్నరంధ్రంలో దూరడం కంటెగూడ ధనవంతుడు మోక్షానికి వెళ్ళడం ఎక్కువ కష్టం అని చెస్తే శిష్యులు నిర్ధాంతపోయి వింటారు. వాళ్ళాలా విని ఆశ్చర్యపోవాలనే, సంపదలు దైవరాజ్యానికి ఎంతగా ఆటంకం కలిగిస్తాయో అర్థం చేసికోవాలనే క్రీస్తు ఉద్దేశం.

సరే, శిష్యులు క్రీస్తు వాక్యం విని సంపదలు నరులను అంతగా ఆటంకపరచేవైతే ఇక రక్షణం పొందగలిగేదెవరని నివ్వెరపోయారు. ఆ ప్రభువ “మానవులకిది అసాధ్యం, కాని దేవునికి సర్వమూ సాధ్యమే" అని బదులు చెప్పాడు — మార్కు 10, 23-27. ఇక్కడ "దేవునికి సర్వమూ సాధ్యమే? అంటే దేవుడు ఏదో అద్భుతంచేసి ధనవంతులకు, వాళ్ళడబ్ళు వాళ్ళకుండగానే, మోక్షం దయచేస్తాడని భావంకాదు. దేవునికి సాధ్యమయ్యేదేమిటి?