పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పై వాక్యంలో “డబ్బునీ దైవాన్ని రెండింటినీ సేవించలేరు" అన్నపుడు క్రీస్తు రెండు భావాలను ఉద్దేశించాడు. మొదటిది, దాస్యం అనే భావం. డబ్బును కూడబెట్టేవాడు దానికి దాసుడైపోతాడు. దానికి ఊడిగంచేస్తాడు. ఇక దేవునికి ఊడిగంచేయడానికి అతనికి వ్యవధి వుండదు. అసలు డబ్ళే అతనికి దైవం ఔతుంది. అతడు సిరినే దేవుణ్ణి కొల్చినట్లుగా కొలుస్తాడు.

అసలు మన హృదయాన్ని వశంచేసికొనే విచిత్రమైన శక్తి యేదో డబ్బులో వుంది. అది మనలను అవలీలగా బానిసలను చేసి ఏలుకొంటుంది. ధనలోభంవల్లనే పూర్వం యూదులు దేవాలయాన్ని వ్యాపారస్థలంగా మార్చారు - యోహా 2,16. డబ్బుకి దాసులయ్యే అననీయా సఫీరా పేత్రు యెదుట బొంకి శాపం పాలయ్యారు - అకా 5,1- 10. మాంత్రికుడైన సీమోను డబ్బుపెట్టి దేవుని వరాలనుకొని వాటినిమళ్ళా ఎక్కువ డబ్బుకు అమ్ముకోవాలని చూచాడు. కాని అతడు కూడ పేత్రు శాపానికి గురయ్యాడు-అచ 8, 18-24 .కైసరయా రాష్టాధిపతియైన ఫీలిక్సు పౌలు బోధలను వింటూన్నట్లే నటించి అతని వద్దనుండి డబ్బు గుంజుకోవాలని చూచాడు. ఇతడుకూడ ధనవాంఛకు లొంగినవాడే. కాని ధనానికి దాసులైన వాళ్ళందరిలోను యూదా అగ్రగణ్యుడు. అతడు ప్రధానాచార్యలనుండి డబ్బుతీసికొని క్రీస్తుని పట్టిఈయడానికి సంసిద్దుడయ్యాడు - మార్కు 14-11. యోహా 12,6. కావలిసైనికులుకూడ యూదుల నుండి సొమ్మ తీసికొని క్రీస్తు ఉత్థానం కాలేదని కూట సాక్ష్యం పల్మారు - మత్త28, 11-15. ఈ యుదాహరణలను బట్టి నరుడు ఎంత తేలికగా ధనానికి దాసుడైపోతాడో అర్థమౌతుందికదా! ఔను, ధనంలో మహా దుష్టశక్తి యేదో వుంది. అది విషప్రాయమైంది. కనుక వివేచన లేకుండా ధనాన్ని ప్రోగుజేసికొనేవాడు దాని విషం సోకి నాశమైపోతాడు.

ఇక రెండవది, అన్యాయం అనే భావం. నరుడు తరచుగా అన్యాయంగా సామ్మకూడబెడతాడు - లూకా 16,9. మామూలుగా ఏవో కొన్ని అన్యాయాలు చేయందే డబ్బు ప్రోగుజేయలేం. కనుక దాని ఆర్థనలోనే నరుడు పాపం గట్టుకొని దేవునికి దూరమైపోతాడు. ఫలితంగా ధనవంతుడు దేవుణ్ణి సేవించలేడు.

ఇక, ద్రవ్యాన్ని కాక దేవుణ్ణి మాత్రమే సేవించే భక్తుడు ఈ సృష్టివస్తువులనుకాక ఆ భగవంతుణ్ణి నమ్ముతాడు. అతన్నితండ్రినిగా భావిస్తాడు. ఏ యాందోళనలకూ గురికాక అతని మీద భారంవేసి జీవిస్తాడు. ఆలాంటివాడు ఏమితిందామా, ఏమిత్రాగుదామా, ఏమికట్టుకొందామా అని కలత జెందడు. దీర్గాయువా అల్పాయువా అని వెత జెందడు - మత్త 6, 23-34. లూకా 12, 25. అన్నిటికీ ఆ ప్రభువే వున్నాడని నమ్మి నిమ్మళంగా జీవిస్తాడు. డబ్బు కూడబెట్టేవాడికి ఈ బుద్ధి వుండదు. అతడు దేవుణ్ణి నమ్మడు. దైవబలంమీదకాక ధనబిలంమీద ఆధారపడి జీవిస్తాడు.