పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనవంతుణ్ణి ధనవంతుణ్ణిగానే మోక్షం చేర్చడం గాదు. అతనికి తన సొత్తుపట్ల పరిత్యాగ బుద్ధిని పట్టించడం. అతడు ధనంకంటె గూడ దేవుడే గొప్ప విలువ అని అర్థం చేసికొనేలా చేయడం. ఆలా అర్థం చేసికొని డబ్బుమీద మమకారం వదలుకొని దైవరాజ్యాన్ని పొందేలా చేయడం. ఈ వరాన్ని మాత్రం పై సంఘటనంలోని ధనికయువకుడు పొందలేకపోయాడు.

శిష్యుడు పూర్తిగా భగవంతునిమీదనే ఆధారపడి జీవించాలి. ఇక, ధనవంతులు కూడ తమ సొమ్ము మీద కాక దేవుని మీద ఆధారపడి జీవించడం అసంభవం కాదు. క్రీస్తు తన శిష్యులను ప్రతివాళ్ళనూ సొంత ఆస్తులను పరిత్యజించమని అడగలేదు. అరిమత్తయియ యోసేపు సంపన్నుడు. ఐనా క్రీస్తు శిష్యుడు - మత్త27, 57-60. కాని ఈలాంటి వాళ్ళు చాల అరుదు. వస్తుతః ధనవంతులు చాలమంది దేవునిమీద ఆధారపడరు. చిక్కు యిక్కడే వుంది. కనుక క్రీస్తుశిష్యుడు కాగోరేవాడు ప్రపంచవస్తువులకు వేటికీ అంటిపెట్టుకోగూడదు, పౌలు చెప్పినట్లుగా, ఆ ప్రభువుతో పోల్చుకొంటే ఈ లోకంలోని వస్తువులన్నీ పెంటప్రోవతో సమానం అని తలంచగలిగి వుండాలి – ఫిలి 3,8.

లూకా సువిశేషంలో ప్రభువు సంపన్నులను ఉద్దేశించి “ధనికులారా! మీరు శాపగ్రస్తులు. మీరు మీ సుఖాన్ని అనుభవించనే అనుభవించారు” అంటాడు. దానికి భిన్నంగా ప్రభువు పేదలను ధన్యలనుగా చిత్రించాడు. వాళ్ళకు దైవరాజ్యం దక్కుతుందని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడి జీవిస్తారు కనుక -6, 20.24.మోషే ద్వితీయోపదేశ గ్రంథంలో దేవుని ఆజ్ఞలను పాటించేవాళ్ళకి దీవెనలూ, పాటించని వాళ్ళకు శాపమూ కలుగుతుందని చెప్పాడు - 28, 2.15. ఆలాగే ఈ ధన్యవచనాల్లోకూడ పేదలు ప్రభువు ఆజ్ఞలను పాటించి దీవెనలు పొందేవాళ్ళనీ, ధనవంతులు ప్రభువు ఆజ్ఞను మీరి శాపం తెచ్చుకొనేవాళ్ళనీ అర్థం చేసికోవాలి.

ఇంకో తావులో ప్రభువు "అన్నిటినీ పరిత్యజిస్తేనే తప్ప ఎవడూ నా శిష్యుడు కాలేడు” అని నుడివాడు. లూకా 14, 33. ఈ బోధకు అనుగుణంగా ప్రభువే అన్నిటినీ విడనాడాడు. నక్కలకు బొరియలున్నాయి. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారునికి తలదాచుకొనే తావైనా లేదు. అతడు సర్వసంగ పరిత్యాగి - 9, 58. ఈ సందర్భాలన్నిటిని బట్టి అర్థమయ్యేదేమిటంటే, మోక్షరాజ్యాన్ని పొందగోరే నరుడు ధనాపేక్షను పరిత్యజించి తీరాలి.

4 సంపదలు తోడినరుణ్ణి పట్టించుకోనీయవు

పూర్వాంశంలో సంపదలు దేపట్టీ దైవరాజ్యాన్నీ చేరనీయకుండా అడ్డుపడతాయని చెప్పాం. వాటిల్లో ఇంకో దుర్గుణం కూడ వుంది. సంపన్నుడు తోడినరుణ్ణి పట్టించుకోడు.