పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. ప్రార్థనా భావాలు

1. చాలమంది మేము అంతటివాళ్ళం ఇంతటివాళ్ళం అనుకొని మిడిసి పడుతూంటారు. చిన్నబిడ్డల్లాగ వినయమూ సరళ స్వభావమూ, దేవుని పట్ల నమ్మకమూ ఆధార మనస్తత్వమూ అలవర్చుకోరు. కాని భక్తుడైన కీర్తనకారుడు తన సంగతిని చెప్పకోవలసి వచ్చినప్పుడు చిన్నబిడ్డను ఉపమానంగా తీసికొన్నాడు.

"ప్రభో! నా గర్వాన్ని వదులుకొన్నాను
నా మిడిసిపాటును అణచుకొన్నాను
నేను గొప్పగొప్ప సంగతులను గూర్చి గాని
కష్టమైన విషయాలను గూర్చి గాని
ఆలోచించదల్చుకోలేదు
నేను నెమ్మదిగాను ప్రశాంతంగాను ఉండిపోతాను
తల్లి రొమ్ము మీద నిమ్మళంగా
పండుకొనివున్న పసిబిడ్డలాగ
నా హృదయం కూడ ప్రశాంతంగా వుంది"

అని చెప్పకొన్నాడు - కీర్త 131. ఉత్తమ శిష్యుడంటే ఈ కీర్తనకారుడే తన్ను తాను హెచ్చించుకొనేవాడు కాదు, తగ్గించుకొనే వాడు శిష్యుడు. నేను గొప్పవాణ్ణి అనుకొనేవాడు కాదు, కొలది పాటివాణ్ణి అనుకొనేవాడు శిష్యుడు. సోక్రటీసులో, గాంధీలో, ఐన్స్టయిన్లో ఈ చిన్నబిడ్డ మనస్తత్వం వుండేది. భక్తురాలు చిన్న తెరేసలో ఈ మనస్తత్వం వుండేది. ఈలాంటి పుణ్యాత్ములు నడచిన త్రోవలో నడచేవాడే క్రైస్తవ శిష్యుడు.

2. చిన్నపిల్లల పట్ల మనకు ఓ విధమైన ప్రేమా ఆదరాభిమానాలూ వుండాలి. మనం వాళ్ళను చూచి ఆనందించాలి. అసలు వాళ్ళ ఉనికే మనకు ఇష్టం పట్టించాలి. బాబిలోను రాజులు యెరూషలేము పట్టణాన్ని ముట్టడించి నాశం చేసారు. యూదులను బందీలనుగా కొనిపోయారు. ఇక ఆ నగరంలో ఎవరూ లేరు. అదిపాడుపడి బీడైపోయింది. కాని ప్రభువు అనుగ్రహం వల్ల యూదులు ప్రవాసశిక్షను ముగించుకొని మళ్ళా యెరూషలేముకు తిరిగి వస్తారనీ, ఆ నగరంలో మళ్ళా నివాస మేర్పరచుకొంటారకనీ ప్రవక్తలు ప్రవచించారు. ఈ సందర్భంలో జేకర్యా అనే ప్రవక్త చెప్పిన ప్రవచన మిది.

"యెరూషలేము మల్లా నివాసయోగ్యమౌతుంది
ముసలితాతలూ అవ్వలూ కర్రమిూద నడచి వచ్చి
నగర వీధిలో రచ్చబండ వద్ద కూర్చుంటారు
వీధుల నిండా బాలబాలికలు గుంపులుగుంపులుగా ప్రోగై
ఆటలాడుకొంటారు" - 8,3-5